
WhatsApp, Telegram: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, నకిలీ గుర్తింపుల కుంభకోణాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా వినియోగదారులు ఎక్కువగా వాడే మెసేజింగ్ యాప్‌లపై తన నిఘాను మరింత తీవ్రం చేసింది. ఇటీవల వాట్సాప్ తీసుకురావాలని భావిస్తున్న ‘యూజర్‌నేమ్’ ఆధారిత ఫీచర్‌పై మెటా సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న మరికొన్ని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా తాజాగా నోటీసులు పంపింది.
ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూజర్‌నేమ్ వ్యవస్థలు అసలు ఎలా పనిచేస్తాయి? నకిలీ గుర్తింపులు, దుర్వినియోగాన్ని నిరోధించడానికి వారు అంతర్గతంగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా వినియోగదారులను ఎలా కాపాడుతున్నారు? అనే అంశాలపై తక్షణమే సవివరమైన వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసుల ద్వారా ఆదేశించింది.
ప్రస్తుతం మన దేశంలో అమల్లో ఉన్న విధానం ప్రకారం వాట్సాప్ లేదా ఇతర యాప్‌లలో ఒకరిని సంప్రదించాలన్నా, గ్రూపుల్లో చేరాలన్నా అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కానీ కొత్తగా ప్రవేశపెట్టాలని చూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ వల్ల వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం యూజర్‌నేమ్ ఆధారంగానే సందేశాలు పంపవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు మంచిదే అయినప్పటికీ.. సైబర్ నేరగాళ్లకు ఇది ఒక పెద్ద వరంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంటోంది.
Also Read : ఈ రాశులకు బిగ్ అలర్ట్.. జాగ్రత్త వహించకపోతే తప్పని తిప్పలు
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే దుండగులు సులభంగా తమ అసలు గుర్తింపును దాచిపెట్టవచ్చు. ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు, పోలీస్ అధికారులు, సీబీఐ అధికారులు, బ్యాంకులు లేదా ప్రభుత్వ ఏజెన్సీల పేర్లను పోలి ఉండేలా నకిలీ యూజర్‌నేమ్‌లను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ ప్రజలు అవి నిజమైన అకౌంట్లేనని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. ఇటీవల దేశాన్ని కుదిపేస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లు, ఫిషింగ్ లింకులు, పార్సిల్ స్కామ్‌లు, నకిలీ గుర్తింపులతో సాగే ఆన్లైన్ దాడులు ఈ ఫీచర్ వల్ల మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ భద్రతా లోపాలను పూర్తిగా సరిదిద్ది, అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఈ ఫీచర్‌ను భారతదేశంలో విడుదల చేయవద్దని మెటా సంస్థను కేంద్రం గట్టిగా ఆదేశించింది.
సైబర్ నేరాలను, మోసాలను పెంచే అవకాశం ఉన్న ఇలాంటి ఒక ఫీచర్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఎలా ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ఐటీ చట్టంతో పాటు ఐటీ నిబంధనలు-2021 కింద మీపై ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులో పేర్కొంది. ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోగా పూర్తి సాంకేతిక పత్రాలతో కూడిన వివరణను ప్రభుత్వానికి సమర్పించాలని గడువు విధించింది.
ఈ నోటీసులపై స్పందించిన వాట్సాప్ తమ ప్లాట్‌ఫారమ్‌లో భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, నేరాల నియంత్రణ కోసం ఇప్పటికే పలు రకాల రక్షణ వలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. యూజర్‌నేమ్ ఫీచర్ వచ్చినప్పటికీ, వినియోగదారులు తమ అకౌంట్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్లు ఐడీలను ఊహించి పదే పదే మెసేజ్‌లు పంపకుండా గట్టి ఆంక్షలు విధిస్తామని, ఒకేసారి ఎక్కువ మంది కొత్త వ్యక్తులకు సందేశాలు పంపకుండా పరిమితులు విధిస్తామని పేర్కొంది. నకిలీ గుర్తింపులతో అకౌంట్లు తెరిచే వారిని గుర్తించి, వెంటనే తొలగించే అధునాతన ఏఐ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని, ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్‌ను సురక్షితంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Also Read : కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త మలుపు..!









