Bandla Ganesh : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని విలువైన స్థిరాస్తిని యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. బండ్ల గణేశ్‌కు గతంలో అనుకూలంగా ఉన్న డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (DRT) ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది.

కేసు నేపథ్యం ఏమిటంటే?
కార్పొరేట్‌ రుణగ్రహీత అయిన ‘శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీకి బండ్ల గణేశ్‌, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా, గ్యారెంటీర్లుగా (హామీదారులు) ఉన్నారు. అయితే, ఈ కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో మొండిబాకీగా మారింది. దీంతో రుణ వసూళ్లలో భాగంగా బ్యాంకు చర్యలు చేపట్టింది. హామీదారులుగా ఉన్న బండ్ల గణేశ్‌ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్‌ ఆస్తిని సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద 2019లో యూనియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. అనంతరం 2022లో ఈ ఆస్తికి బహిరంగ వేలం నిర్వహించగా రూ.8.51 కోట్ల ఆదాయం వచ్చింది.

బ్యాంకు నిర్వహించిన ఈ వేలం చెల్లదంటూ బండ్ల గణేశ్‌ డీఆర్‌టీని ఆశ్రయించగా, వేలాన్ని రద్దు చేస్తూ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ యూనియన్‌ బ్యాంక్‌తో పాటు సదరు ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపింది.

బ్యాంకు తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. రుణం చెల్లింపునకు సంబంధించి ఒక దశలో బండ్ల గణేశ్‌ కుటుంబం వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (OTS) కింద రూ.82 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. ఆ ఓటీఎస్ మొత్తంలో ఈ వేలం ద్వారా వచ్చిన రూ.8.51 కోట్లను మినహాయించుకోవడానికి కూడా బ్యాంకు అంగీకరించిందన్నారు. ఈ క్రమంలో బ్యాంకుపై వేసిన ఇతర పిటిషన్లను ఉపసంహరించుకుంటామని ఒప్పందం చేసుకున్న బండ్ల గణేశ్‌, ఆ తర్వాత మాట తప్పి డీఆర్‌టీని ఆశ్రయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (NCLT)లో దివాలా పరిష్కార ప్రక్రియ నడుస్తున్నందున ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం (Moratorium) ఉంటుందని, కాబట్టి వేలం చెల్లదని బండ్ల గణేశ్ తరఫున వాదనలు వచ్చాయి. అయితే, బ్యాంకు న్యాయవాది దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ ఆస్తి దివాలా తీసిన కంపెనీది కాదని.. వ్యక్తిగతంగా హామీదారులైన (Personal Guarantors) బండ్ల గణేశ్‌ కుటుంబానిదని, అందువల్ల ఎన్‌సీఎల్‌టీ నిషేధం దీనికి వర్తించదని స్పష్టం చేశారు.

ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను, రికార్డులను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం బ్యాంకు వాదనలతో ఏకీభవించింది. వాస్తవాలను, రికార్డులను సరిగ్గా పరిశీలించకుండా డీఆర్‌టీ గతంలో ఇచ్చిన తీర్పు చెల్లదని కొట్టేసింది. హామీదారుల ఆస్తిపై వేలం వేసే హక్కు బ్యాంకుకు ఉంటుందని స్పష్టం చేస్తూ, యూనియన్ బ్యాంక్ నిర్వహించిన విక్రయాన్ని చట్టబద్ధమైనదేనంటూ సమర్థించింది. దీంతో జూబ్లీహిల్స్ ఆస్తి వివాదంలో బండ్ల గణేశ్‌ కుటుంబానికి చట్టపరంగా పెద్ద ఉపశమనం లభించనట్లయింది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.