
Ayodhya : అయోధ్య రామాలయానికి వచ్చే కానుకల లెక్కింపు విధానంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కొన్ని కీలక మార్పులు చేసింది. ఆలయ కానుకల లెక్కింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో, భద్రతను మరింత పెంచుతూ, పారదర్శకత కోసం ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం.. కానుకలు లెక్కించే సిబ్బంది లెక్కింపు హాల్‌లోకి వెళ్లే ముందు రెండు అంచెల కఠినమైన తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు, సిబ్బంది కోసం ఒక కొత్త డ్రెస్ కోడ్‌ను కూడా విధిగా పెట్టారు. డబ్బును గానీ, ఇతర విలువైన వస్తువులను గానీ దాచడానికి వీల్లేకుండా జేబులు లేని ముదురు నీలం రంగు దుస్తులను మాత్రమే వారు వేసుకోవాలి.
కానుకలు లెక్కించే పద్ధతిని కూడా పూర్తిగా మార్చేశారు. ఇకపై సిబ్బంది కుర్చీలు, టేబుళ్లపై కూర్చోకుండా.. కేవలం కింద నేలపై కూర్చుని మాత్రమే కానుకలను లెక్కించాల్సి ఉంటుంది. లెక్కింపు హాల్‌లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, అలాగే వారి సొంత వస్తువులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. సిబ్బంది తమ చెప్పులను కూడా బయటే విడిచిపెట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
రామాలయం కానుకల దుర్వినియోగంపై సిట్ విచారణ జరుపుతున్న సమయంలోనే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ కేసులో భాగంగా ట్రస్ట్‌కు చెందిన గత ఐదేళ్ల అకౌంట్లను, ఆలయ నిర్మాణ ఖర్చులను, అలాగే నగదు, బంగారం, వెండి రూపంలో వచ్చిన కానుకలను ఎస్ఐటీ బృందం మరోసారి పూర్తిగా తనిఖీ చేయనుంది.
ఈ కానుకల అక్రమాల వ్యవహారం జూన్ 7న వెలుగులోకి రాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణ ఆధారంగా జూన్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఇప్పటివరకు ఈ లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముఖ్య నిందితుడైన అవినాష్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతని వద్ద నుంచే భారీగా నగదు రికవరీ అయినట్లు తెలిసింది.
ఈ విచారణ సెగ ట్రస్ట్‌లోని సీనియర్ సభ్యులకు కూడా తాకింది. మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ అధికారి గోపాల్ రావులను ఎస్ఐటీ ఇప్పటికే ప్రశ్నించింది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేయగా, జూలై 6న జరిగే ట్రస్ట్ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ట్రస్ట్ ఏర్పాటుకు ముందు వచ్చిన కానుకల వివరాలను కూడా బహిరంగపరచాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది.









