
Kannepalli Pump House : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేపట్ట తలపెట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, కానీ నీళ్లున్నా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులను ఇబ్బంది పెడుతోందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వాస్తవ పరిస్థితులను, వృధాగా పోతున్న కాళేశ్వరం జలాలను ప్రజలకు చూపించేందుకు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల బృందం ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి బయలుదేరింది.
Also Read : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..ఏకంగా 7,437 పోస్టులకు అనుమతి
View this post on Instagram
అయితే, కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం, పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ కన్నెపల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై పోలీసులు భారీగా మోహరించి, పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. కన్నెపల్లి పర్యటనకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతుల వాహనాలను హైవేపై ఎక్కడికక్కడ నిలిపివేశారు.
ఈ క్రమంలోనే జనగాం జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టడంతో కేటీఆర్ కాన్వాయ్ అక్కడే నిలిచిపోయింది. అకారణంగా తమ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కేటీఆర్‌తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి తదితర ముఖ్య నేతలు వాహనాల నుంచి దిగి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాము శాంతియుతంగా పర్యటనకు వెళ్తుంటే అడుగడుగునా ఆంక్షలు విధించడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారనే వార్త తెలియడంతో జనగాం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు భారీ సంఖ్యలో పెంబర్తి వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read : రక్తమోడిన రోడ్లు… నలుగురు మృతి.. పలువురికి గాయాలు
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తన వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమ్ము అడ్డుకుంటోందని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండగట్టే కుట్రలు చేస్తోందని, ఆ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టి తీరుతామని అన్నారు. వృధాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను, ప్రభుత్వ చేతగానితనాన్ని తెలంగాణ ప్రజలకు చూపెడతామని స్పష్టం చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని బారికేడ్లు పెట్టినా కన్నెపల్లి సందర్శనకు వెళ్లి తీరుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.









