
CURE Bill : హైదరాబాద్ మహా నగర పరిపాలనా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సరికొత్తగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 1955 నాటి పాత మున్సిపల్ కార్పొరేషన్ చట్టం (జీహెచ్ఎంసీ-1955 చట్టం) స్థానంలో కాలానికి అనుగుణంగా సరికొత్త సంస్కరణలతో కూడిన నూతన చట్టాన్ని తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (క్యూర్ – CURE) ముసాయిదా బిల్లు (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్)-2026ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.గతంలో 15 లక్షల జనాభా ఉన్న నాటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటి ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత కాలంలో అది జీహెచ్ఎంసీగా మారింది. ఇటీవల ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పునర్విభజన చేసింది.
ప్రస్తుతం ఈ మూడు కార్పొరేషన్లలో పాత చట్టం కిందే పాలన సాగుతుండగా, వాటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ ఈ సమగ్ర ఏకీకృత నూతన చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ నూతన ‘క్యూర్-2026’ ముసాయిదా బిల్లులో మొత్తం 43 చాప్టర్లు, 9 షెడ్యూళ్లను పొందుపరిచారు. ఈ సుదీర్ఘ బిల్లుపై పౌరులు, పట్టణాభివృద్ధి నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ అభ్యంతరాలు సూచనలను ఈ నెల 24వ తేదీలోగా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరింది. ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, అవసరమైన మార్పులు చేసిన అనంతరం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముసాయిదా బిల్లును ప్రజల పరిశీలన కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. వెబ్సైట్లో బిల్లు ప్రతిని తెరవగానే పేజీ క్రింద ‘ప్రొసీడ్ టు ఫీడ్‌బ్యాక్’ అనే వెబ్‌లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే సూచనలు, అభిప్రాయాలను నమోదు చేసే అప్లికేషన్ వస్తుంది. దీని ద్వారా పౌరులు ఎవరైనా తమ విలువైన సలహాలను నేరుగా ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపించే సులభతర సదుపాయాన్ని కల్పించారు.
మున్సిపల్ కార్పొరేషన్ల చరిత్రలోనే తొలిసారిగా నూతన క్యూర్ చట్టం ద్వారా ట్రాన్స్జెండర్లకు అధికారిక ప్రాతినిధ్యం కల్పించనున్నారు. సమాజంలో భాగమైన వారికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లులోని ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. దీనితో పాటు కార్పొరేటర్ల అనర్హతకు సంబంధించిన కొన్ని పాత నిబంధనలను చట్టం నుండి తొలగించడం జరిగింది. కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, ఎన్నికల నిర్వహణ, రుణాల సేకరణ అధికారాలు వంటి ప్రధాన అంశాలు పాత చట్టంలో ఉన్న విధంగానే కొనసాగుతాయి.నగర సమగ్ర పర్యవేక్షణ, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం, విపత్తుల సమర్థవంతమైన నిర్వహణ కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రత్యేకంగా ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ ,ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ అత్యున్నత కౌన్సిల్ పరిధిలోకి విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, హైడ్రా, పర్యావరణ మార్పులు, వారసత్వ పరిరక్షణ , లింగ సమానత్వం వంటి అత్యంత కీలకమైన విభాగాలు వస్తాయి.
క్యూర్ పరిధిలో ఆస్తి పన్ను మదింపులో ప్రభుత్వం భారీ సంస్కరణలను ప్రతిపాదించింది. ప్రస్తుతం పాత జీహెచ్ఎంసీ పరిధిలో వార్షిక అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్ను లెక్కిస్తుండగా, ఇకపై దాని స్థానంలో రాష్ట్రవ్యాప్త మున్సిపాలిటీల తరహాలోనే ‘మూలధన (కేపిటల్) విలువ ఆధారిత ఆస్తిపన్ను’ విధానాన్ని తీసుకురానున్నారు. ప్రాంతాల వారీగా ఉన్న ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలను బట్టి ఆయా స్థలం , భవనం యొక్క మూలధన విలువను లెక్కించి పన్ను నిర్ధారిస్తారు.నూతన పన్ను విధానం ప్రకారం.. నివాస కేటగిరీ నిర్మాణాలకు వాటి మూలధన విలువలో 0.10 శాతానికి తగ్గకుండా, 0.50 శాతానికి మించకుండా వార్షిక పన్ను విధిస్తారు. అలాగే నివాసేతర (వాణిజ్య) కేటగిరీలో 0.20 శాతానికి తగ్గకుండా, 2 శాతానికి మించకుండా ఆస్తిపన్నును నిర్ధారిస్తారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో పన్ను స్వీయ మదింపునకు (సెల్ఫ్ అసెస్మెంట్) కూడా అవకాశం కల్పించారు.
Also Read : ప్రియుడితో కలిసి దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేసింది!
కొత్త చట్టం ప్రకారం నగరంలోని ప్రతి ఆస్తికి ఒక ‘ప్రత్యేక గుర్తింపు కోడ్’ (యూనిక్ కోడ్) కేటాయించబడుతుంది. కాలం చెల్లిన ఆక్ట్రాయ్ పన్ను, కుక్కల పన్నులను ఈ కొత్త చట్టం ద్వారా పూర్తిగా రద్దు చేయనున్నారు. పన్నుల వసూళ్లను వేగవంతం చేసేందుకు గాను, ప్రతి ఏటా సకాలంలో ఆస్తి పన్ను చెల్లించే బాధ్యతాయుతమైన పౌరులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్) ఇవ్వాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతుల జారీలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేలా కొత్త నిబంధన తెచ్చారు. దరఖాస్తులపై నిర్దేశిత వ్యవధిలోగా సంబంధిత అధికారి ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయం తీసుకోకుంటే, సదరు దరఖాస్తు ఆటోమేటిక్‌గా పైఅధికారికి బదిలీ అవుతుంది. అక్కడ కూడా గడువులోగా నిర్ణయం తీసుకోకుంటే.. కమిషనర్‌కు 7 రోజుల నోటీసు ఇచ్చి దరఖాస్తుదారుడు ‘డీమ్డ్ టు బి అప్రూవల్’ (ఆటోమేటిక్ ఆమోదం) పొందే సదుపాయం ఉంటుంది. అయితే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ, నిషేధిత భూములకు ఈ నిబంధన వర్తించదు.
నగరంలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు తెచ్చారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇచ్చినా పనులు ఆపకపోయినా, ఎవరైనా నివాసం ఉంటున్నా.. కమిషనర్లు 24 గంటల ముందస్తు నోటీసు ఇచ్చి వాటిని సీజ్ చేయవచ్చు. ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉంటే ఎటువంటి నోటీసు లేకుండానే లిఖితపూర్వక కారణాలు చూపి సీజ్ చేసే అధికారం ఉంటుంది. నివాసయోగ్య పత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) లేని భవనాలకు కరెంట్, వాటర్ కనెక్షన్లు ఇవ్వకూడదనే నిబంధనను టిజిఎస్పిడిసిఎల్, వాటర్ బోర్డులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పాత జీహెచ్ఎంసీ చట్టంలో ట్రేడ్ లైసెన్స్‌లు, ప్రజారోగ్యానికి సంబంధించి సాధారణ అధికారాలు మాత్రమే ఉండేవి. కానీ క్యూర్ చట్టంలోని ‘అధ్యాయం-33’లో ప్రత్యేకంగా ఆహార భద్రత, పోషకాహారం అంశాలను చేర్చారు. దీని ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కన్వీనర్‌గా ‘ఆహార భద్రత, పోషకాహార కమిటీ’ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ హోటళ్లు, ఫుడ్ పాయింట్లలో పరిశుభ్రతను పర్యవేక్షిస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ కేసులను విశ్లేషించి భవిష్యత్ నివారణ చర్యలు తీసుకుంటుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణ మార్పులపై యాక్షన్ ప్లాన్, నిర్మాణ వ్యర్థాల (C&D) శాస్త్రీయ నిర్వహణ, మురుగునీటి రీసైక్లింగ్, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల పూర్తిస్థాయి పరిరక్షణ బాధ్యతలను అప్పగిస్తూ.. ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థకు ఈ కొత్త చట్టం ద్వారా పూర్తిస్థాయి చట్టబద్ధ గుర్తింపు కల్పించనున్నారు. ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తే ఆ స్థలం మూలధన విలువలో 0.25 శాతం మేర భారీ జరిమానా విధిస్తారు.నగర ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కొన్ని ప్రాంతాలను ‘నైట్ ఎకానమీ జోన్లు’గా ప్రకటించి రాత్రంతా వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతులిస్తారు. వ్యాపారవేత్తలు, దుకాణదారులు బహుళ అనుమతుల కోసం ఇబ్బంది పడకుండా అందరికీ ఒకే ‘సింగిల్ ట్రేడ్ లైసెన్స్’ విధానాన్ని ప్రతిపాదించారు. అలాగే సెక్షన్ 168 ప్రకారం అనుమతి లేని ఆస్తులు, అక్రమ నిర్మాణాల క్రయవిక్రయాలు, బదిలీలను పూర్తిగా నిషేధించి, వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తారు.
నగర పౌరుల సౌకర్యార్థం ప్రభుత్వం సరికొత్తగా ఏకీకృత బిల్లింగ్ విధానాన్ని తీసుకురానుంది. ఇకపై మున్సిపల్ ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు, తాగునీరు-మురుగునీటి ఛార్జీలు, అలాగే ట్రాఫిక్ చలాన్లు.. ఇలా అన్నీ కలిపి ఒకే ‘సింగిల్ యుటిలిటీ బిల్లు’ రూపంలో ప్రజల ముందుకు రానున్నాయి. అలాగే పౌరుల అత్యవసర సేవలన్నింటికీ ఒకే ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెస్తారు. ప్రజల ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారానికి ‘క్యూర్ అప్పిలేట్ అథారిటీ’ని ఏర్పాటు చేయనున్నారు.ఏదైనా అత్యవసర విపత్తు తలెత్తితే అన్ని ప్రభుత్వ శాఖలను తక్షణమే అప్రమత్తం చేయడానికి డిజిటల్ ఆధారిత ‘క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్, రహదారి భద్రత కోసం ప్రత్యేక సంస్థలు, అన్ని శాఖల పనుల సమన్వయానికి ‘క్యూర్ యుటిలిటీ కో-ఆర్డినేషన్ కమిటీ’ రానున్నాయి. అలాగే నగరంలోని అసంఘటిత కార్మికులు, గిగ్ వర్కర్ల సంక్షేమం, జీవనోపాధిని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక సమన్వయ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చట్ట ఉల్లంఘనలకు క్రిమినల్ చర్యల కంటే దశలవారీగా సివిల్ జరిమానాలు విధించేలా నిబంధనలు సరళతరం చేశారు.
Also Read : అనర్హులకు తెలంగాణ సర్కార్ షాక్… లక్ష ఫించన్లకు చెక్ ?









