Donald Trump : అమెరికా-ఇరాన్‌ల మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ ప్రాతిపదికన తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందం చెల్లదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరో విడత భీకర దాడులు జరుపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తుర్కియేలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో పాల్గొన్న ఆయన, ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్ పదేపదే శాంతి ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అంతర్గత చర్చల్లో ఒకలా మాట్లాడుతూ, బహిరంగంగా దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ ఇదే రీతిలో పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని, ఈ పిచ్చి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేస్తూ, ఈ రాత్రికి మరో విడత దాడులు తప్పవని నాటో వేదికగా విలేకరులతో పేర్కొన్నారు.

గత రాత్రి అమెరికా దళాలు జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్‌కు చెందిన సుమారు 28 యుద్ధ నౌకలతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. రాబోయే దాడుల్లో ఇరాన్ విద్యుత్ గ్రిడ్లు, నీటి సరఫరా వ్యవస్థలతో పాటు ఆ దేశ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి ‘ఖర్గ్‌ ద్వీపాన్ని’ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలను పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు రేపు జరగనున్న తరుణంలో ట్రంప్ ఈ తీవ్ర హెచ్చరికలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్షలాది మంది ప్రజలు, బలగాలు ఒకే చోటికి చేరుకుంటారని, అలాంటి సమయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు అమెరికా వ్యూహ రచన చేస్తోందనే ప్రచారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

అయితే, అమెరికా చేస్తున్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. శాంతి ఒప్పందాన్ని తొలుత ఉల్లంఘించింది అమెరికానేనని ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. తమ ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లలో విక్రయించేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను యూఎస్ ఏకపక్షంగా ఉపసంహరించుకుందని, ఆర్థికంగా తమను దెబ్బతీసేందుకే ఈ తరహా ఆంక్షలు, దాడులకు పాల్పడుతోందని ఇరాన్ విమర్శించింది.

ఇటీవల హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దళాలు విరుచుకుపడటంతో ఈ వివాదం మరింత రాజేసుకుంది. ఇరాన్ దాడులకు నిరసనగా అమెరికా ఇప్పటికే ఆ దేశ తీరప్రాంత రాడార్లు, 60కి పైగా సైనిక నౌకలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్త క్షిపణి దాడుల స్థాయికి చేరడంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ట్రంప్ చేసిన ఈ భీకర హెచ్చరికలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రభావాన్ని చూపాయి. అమెరికా-ఇరాన్ సంక్షోభం తీవ్రమవ్వడంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలగా, ముడి చమురు (Crude Oil) ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా మండిపోతున్నాయి. హర్మూజ్ జలసంధి మూతపడితే ప్రపంచ చమురు సరఫరా నిలిచిపోతుందనే భయంతో పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

శాంతియుత పరిష్కారానికి కుదిరిన అవగాహన ఒప్పందం రద్దవ్వడం, ఇరు దేశాలు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడంతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. రష్యా, చైనా సహా ఐక్యరాజ్యసమితి (UN) ఇరు వర్గాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బుధవారం రాత్రి అమెరికా జరపబోయే దాడుల ప్రభావం పశ్చిమాసియాను మరింత రణరంగంగా మార్చే ప్రమాదం కనిపిస్తోంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.