Prambanan Temple : ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా, ఆ ముస్లిం దేశంలోనే అత్యంత పెద్దదైన శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇస్లాం మతాన్ని అనుసరించే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా ప్రధాని మోదీని ఈ దేవాలయానికి తీసుకువెళ్లారు. ఈ సాంస్కృతిక సామరస్య దృశ్యం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.

తన మూడు రోజుల ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి యోగ్యాకార్తాలోని ‘పరంబనన్’ (Prambanan) దేవాలయానికి చేరుకున్నారు. ఇది ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ ప్రాంగణం , యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధ్యక్షుడు సుబియాంటోతో ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ – ‘అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి యోగ్యాకార్తా నుండి పరంబనన్ ఆలయానికి వెళ్తున్నాను’ అని రాశారు. హెలికాప్టర్ నుండి ఆలయ వైమానిక దృశ్యాన్ని చూపే వీడియోను కూడా పోస్ట్ చేస్తూ – ‘భవ్యమైన పరంబనన్ ఆలయం!’ అని పేర్కొన్నారు. ఈ దృశ్యం ఇరు దేశాల బంధం గురించి ఎంతో చెప్పకనే చెబుతోంది.

ఇరు నాయకులు ఉమ్మడిగా పరంబనన్ ఆలయ ప్రాంగణ సంరక్షణ , పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారత్, ఇండోనేషియాల మధ్య ఇప్పటికే అవగాహన ఒప్పందం (Letter of Intent) కుదిరింది. కాషాయ రంగు కుర్తా ధరించి, నుదుటిన త్రిపుండ్ర ధారణతో ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించగా.. ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రబోవో సుబియాంటో ఆయనతో కలిసి ఉండటం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు సాక్ష్యంగా నిలిచింది.

Also Read : మోదీ మాస్టర్ ప్లాన్.. చైనాకు ఊహించని షాక్.. ఇండోనేషియా టూర్ వెనుక సీక్రెట్ ఇదే!

పరంబనన్ ఆలయ విశిష్టత

10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ప్రధానంగా పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ ప్రాంగణంలో హిందూ త్రిమూర్తులు – శివుడు, విష్ణువు, బ్రహ్మల – భవ్యమైన ఆలయాలు ఉన్నాయి. వీటితో పాటు వారి వాహనాలైన నంది, గరుడుల గుళ్లు కూడా ఉన్నాయి. ఆలయ గోడలపై రామాయణ ఘట్టాలను అత్యంత అద్భుతంగా చెక్కారు, ఇది భారత్ , ఆగ్నేయాసియాల మధ్య ఉన్న లోతైన సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ.. ఇరు దేశాలు రామాయణ-మహాభారతాల ఉమ్మడి వారసత్వంపై నిలిచి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండోనేషియా ముస్లిం మెజారిటీ దేశమైనప్పటికీ, గతంలో ఇక్కడ హిందూ, బౌద్ధ మతాలు విలసిల్లాయి. ఈ రోజుకూ అక్కడ హిందూ మతానికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వానికి సమానమైన గౌరవం లభిస్తోంది.

Also Read : సిరియాలో మాక్రాన్ పర్యటన వేళ బాంబుల కలకలం.. భారీ పేలుళ్లు!

గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వ సాంస్కృతిక దౌత్యం

గత దశాబ్ద కాలంలో మోదీ ప్రభుత్వం పొరుగున ఉన్న ఆసియా దేశాల్లోని అనేక ప్రాచీన మతపరమైన స్థలాల సంరక్షణ, పునర్నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించింది. ఇందులో అనేక దేశాలు ఉన్నాయి:

బాంగ్లాదేశ్: రమణా కాళీ మందిర పునర్నిర్మాణం, జోయ్ కాళీ మాతా మందిరం, ఆనందమయి కాళీ మాతా మందిరాల జీర్ణోద్ధరణ.

వియత్నాం: మై సోన్ అభయారణ్యం (ప్రాచీన శైవ క్షేత్ర ప్రాంగణం) సంరక్షణ.

మయన్మార్: బగాన్ పురావస్తు ప్రాంతంలో భూకంపం వల్ల దెబ్బతిన్న పగోడాల పునరుద్ధరణ.

నేపాల్: 2015 భూకంపం తర్వాత 28 సాంస్కృతిక ప్రదేశాల పునర్నిర్మాణం.

కంబోడియా: ఆంగ్‌కోర్ వాట్, తా ప్రోహ్మ్ తదితర క్షేత్రాల సంరక్షణ.

లావోస్: వాట్ పూ శివాలయం పునరుద్ధరణ.

బహ్రెయిన్: శ్రీనాథ్‌జీ ఆలయ అభివృద్ధి.

శ్రీలంక: తిరుకేతీశ్వరం శివాలయ జీర్ణోద్ధరణ.

ఈ ప్రయత్నాలు భారత సాంస్కృతిక దౌత్యాన్ని (Cultural Diplomacy) మరింత బలోపేతం చేస్తున్నాయి. పరంబనన్ ఆలయ ప్రాజెక్ట్ కూడా ఈ దిశగా పడిన మరో కీలక అడుగు. ప్రధాని మోదీ పర్యటన భారత్-ఇండోనేషియాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త వేగాన్ని అందించనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సమృద్ధి సాధనకు ఇరు దేశాలు సహకారాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి. కేవలం ఆర్థిక, రక్షణ సహకారమే కాకుండా, శతాబ్దాల నాటి నాగరికతా వారసత్వాన్ని కూడా బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందని ఈ పర్యటన స్పష్టం చేస్తోంది. పరంబనన్ ఆలయ భవ్యత, ఇరు దేశాల నాయకుల ఉమ్మడి పర్యటన భారత్-ఇండోనేషియా సంబంధాలలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.