
CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసెఫ్ విజయ్‌తో పాటు ఆయన కేబినెట్లోని కీలక మంత్రి, పలువురు ఎమ్మెల్యేల ఎన్నికల విజయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీవీకే రథసారధి విజయ్ గెలుపును ప్రశ్నిస్తూ దాఖలైన ఈ వ్యాజ్యాలపై జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం విచారణ జరిపి, సీఎం విజయ్ సహా ప్రతివాదులందరికీ, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలలో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే పెరంబూర్‌లో విజయ్ చేతిలో ఓడిపోయిన డీఎంకే అభ్యర్థి ఆర్డీ. శేఖర్, స్థానిక ఓటర్లు దినేశ్, లక్ష్మీనరసింహన్లతో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం ఫలితాన్ని సవాల్ చేస్తూ డీఎంకేకే చెందిన ఎస్. ఇనిగో ఇరుదయరాజ్ మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి విజయం వెనుక పలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని పిటిషనర్లు తమ పిటిషన్లలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ముఖ్యంగా ఏప్రిల్ 21న చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో జరిగిన ప్రచార సభలో విజయ్ చిన్నారులను భావోద్వేగపూరితంగా ఉద్దేశించి మాట్లాడారని, వారి ద్వారా కుటుంబ సభ్యుల ఓట్లను ప్రభావితం చేసేలా ప్రసంగించారని పిటిషనర్లు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించకూడదన్న ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను ఇది ఉల్లంఘించడమేనంటూ అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను కోర్టుకు సమర్పించారు. వీటితో పాటు ప్రచార గీతాల వ్యయాన్ని లెక్కల్లో చూపలేదని, ఆస్తుల అఫిడవిట్లో ఆదాయపు పన్ను బకాయిల వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఏప్రిల్ 19న సెయింట్ ఆంటోనీ చర్చిలో మతపరమైన ప్రచారం చేశారని పిటిషన్లలో పేర్కొన్నారు.
Also Read : కేతన్ హత్య కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. సియా సీక్రెట్ పెళ్లి!
మరోవైపు, ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు ఆయన కేబినెట్లోని కీలక మంత్రి, విల్లివాక్కం నియోజకవర్గం నుంచి గెలిచిన క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వీటితో పాటు తిరువణ్నామలై ఎమ్మెల్యే ఈవీ. వేలు, టీవీకేలో చేరిన మాజీ డీఎంకే ఎమ్మెల్యే ఎస్. జయకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే తరగై కుత్బర్ట్ల గెలుపును ప్రశ్నిస్తూ వచ్చిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, జులై 21లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం విచారణ జరుపుతూ పిటిషన్లలో ఉన్న కొన్ని పరిపాలనాపరమైన లోపాలను ప్రస్తావించింది. ‘ఫారమ్ 25’ దాఖలు చేయడం వంటి అవసరమైన నిబంధనలను పిటిషనర్లు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు ఈ సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసిన వెంటనే, ప్రతివాదులందరికీ మూడు వారాల్లోగా హాజరయ్యేలా సమన్లు, నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
శాసనసభ ఎన్నికల పిటిషన్లను చట్టప్రకారం ఆరు నెలల వ్యవధిలోనే వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందుకే కోర్టు ద్వారా పంపే అధికారిక నోటీసులతో పాటు, పిటిషనర్లు స్వయంగా ప్రతివాదులకు ‘ప్రైవేట్ నోటీసులు’ ఇచ్చేందుకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికల వాతావరణం నెలకొంటున్న వేళ, మద్రాస్ హైకోర్టు సీఎం విజయ్, ఆయన సహచరుల గెలుపుపై విచారణకు మొగ్గు చూపడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనానికి, తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.
Also Read : అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు: 38 మందికి ఉరిశిక్ష..గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు









