Former Minister Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నెగిటివ్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తోందని, తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టి నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.

Also Read : పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత!

తుమ్మిడిహెట్టి వివాదం – సీఎమ్‌కు బహిరంగ సవాల్

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు నిజంగానే ఒప్పందం ఉంటే దాన్ని తక్షణమే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,328 కోట్లు తిని వేస్ట్ చేసిందని, కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రెండున్నరేళ్లు తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసిందని, అందుకే శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని స్పష్టం చేశారు.

Also Read : కవితకు బిగ్ షాక్..ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు!

‘మూడు నెలలు అవకాశం ఇవ్వండి.. నీళ్లు తెచ్చి చూపిస్తా’

రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించిన హరీశ్ రావు, రేవంత్ సర్కార్‌కు ఒక కీలకమైన ఆఫర్ ఇచ్చారు.”నాకు పదవులు కొత్త కావు, గతంలో 13 ఏళ్లు మంత్రిగా పనిచేశాను. నాకు కేవలం మూడు నెలల పాటు నీటి పారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి, ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపిస్తా. ఒకవేళ ఆ పని చేయలేకపోతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా.” అని సవాల్‌ విసిరారు. గోదావరిలో నీటి ప్రవాహం పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా దిగువకు వదిలేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్‌డీఎస్‌ఏ (NDSA) సాకు చెబుతున్నారని, మరి సమ్మక్క బ్యారేజీ, దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. సమ్మక్క బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పటికీ మోటార్లు నడపడం లేదన్నారు. ప్రభుత్వం చూపుతున్న అలసత్వం వల్ల వరంగల్ జిల్లాలో 90 శాతం చెరువులు ఎండిపోయాయని తెలిపారు. చెరువులు, రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉన్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఏపీకి ‘గురుదక్షిణ’ చెల్లించుకోవడానికే తెలంగాణ నీటిని వృథాగా దిగువకు వదిలేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుందని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న రేవంత్, ఉత్తమ్‌లను ఉరితీసినా తప్పులేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వ్యాప్కోస్ (WAPCOS) సంస్థపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఎద్దేవా చేశారు. వ్యాప్కోస్‌ను ఒక ‘చెఫ్’ (వంటవాడు) తో పోలుస్తూ మాట్లాడారని, అసలు ఆ సంస్థను తీసుకువచ్చిందే అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే వ్యాప్కోస్ సంస్థను ఆశ్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో నిజం లేదని, అబద్ధానికి ప్యాంటూ షర్టు వేస్తే రేవంత్ రెడ్డిలా ఉంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎంగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.