
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు బిగ్ షాక్ తగిలింది. పిల్లలు, యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని సంస్థపై ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.120 లక్షల కోట్ల దావా ఎదుర్కొంటోంది. అమెరికాలోని దాదాపు 30కి పైగా రాష్ట్రాలు కలిసి మెటాపై ఈ కేసు దాఖలు చేశారు. మెటా ఈ కేసును కొట్టివేయాలని చేసిన అభ్యర్థనను కాలిఫోర్నియా ఫెడరల్ జడ్జి తిరస్కరించడంతో కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో మెటాపై ఆరోపణలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి.
లాభాల కోసం మెటా ఉద్దేశపూర్వకంగానే యువతను ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు బానిసలు చేసేలా తమ అల్గారిథమ్స్‌ను డిజైన్ చేసిందని రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టుకు తెలిపారు. పిల్లల మెదడులో డోపమైన్ విడుదలయ్యేలా చేసే ‘లైక్స్’, ‘నోటిఫికేషన్స్’, ముగింపు లేని ‘ఇన్ఫినిట్ స్క్రోలింగ్’ ఫీచర్లను ఉద్దేశపూర్వకంగా వాడారని పేర్కొన్నారు. ఈ యాప్స్ వల్ల యువతలో తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, శరీర ఆకృతిపై అసంతృప్తి పెరిగిపోతున్నాయని తెలిసినా మెటా కళ్లు మూసుకుందని తెలిపింది. ముఖ్యంగా 13 ఏళ్ల లోపు పిల్లల డేటాన్ని వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే దొంగచాటుగా సేకరించిందని విచారణలో తేలింది.
మరోవైపు మెటా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాము యువత రక్షణ కోసం 50కి పైగా కొత్త సేఫ్టీ ఫీచర్లను ప్రవేశపెట్టామని కోర్టుకు వివరించింది. అంతేకాదు అమెరికా చట్టాల ప్రకారం యూజర్లు పెట్టే కంటెంట్‌కు ప్లాట్‌ఫారమ్ బాధ్యత వహించదని, కాబట్టి ఈ కేసు చెల్లదని వాదించింది. అయితే జడ్జి ఈ వాదనను తోసిపుచ్చారు. ఇది కేవలం యూజర్లు పెట్టే కంటెంట్ గురించి కాదని.. మెటా యాప్స్ డిజైన్ లోపాలు, వారి మోసపూరిత వ్యాపార ప్రకటనల గురించిన కేసు అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ 1.4 ట్రిలియన్ డాలర్ల కేసు కాబట్టి.. మెటాకు వ్యతిరేకంగా ముగిస్తే ఆ సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తింటుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యాప్స్ పనిచేసే విధానమే మారిపోతుంది. టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్ వంటి ఇతర సంస్థలపై కూడా ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో కోర్టు ఇంకా తీర్పునివ్వలేదు.









