
J.P. Nadda :తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని బలోపేతం చేయడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నేత జేపీ నడ్డా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. రాబోయే ఎన్నికలు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు ఆయన సమగ్రమైన కార్యాచరణను అందించారు. రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని శక్తీగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ విస్తరణలో భాగంగా ‘ఆపరేషన్ ఆకర్ష్’ (ఆపరేషన్ లోటస్) కు తలుపులు పూర్తిగా తెరవాలని జేపీ నడ్డా నాయకులకు సూచించారు. వేరే పార్టీల నుంచి బీజేపీ సైద్ధాంతిక విధానాలను అంగీకరిస్తూ వచ్చే నాయకులను, ప్రజాదరణ ఉన్న నేతలను సాదరంగా ఆహ్వానించాలన్నారు. “పార్టీలోకి కొత్త నీరు రావడం అత్యంత అవసరం.. కొత్తగా చేరే ప్రతి ఒక్కరినీ గౌరవించి స్వాగతించాలి” అని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా చేరే నాయకులతో పాత నాయకులు సమన్వయం చేసుకుంటూ, విభేదాలను పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఉద్బోధించారు.
కేవలం రాజకీయ చేరికలకే పరిమితం కాకుండా నాయకులు, కార్యకర్తలు అందరూ నిరంతరం క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని నడ్డా దిశానిర్దేశం చేశారు. నాయకులు ఎవరూ కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల్లో మమేకం కావాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా శ్రమించాలని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అమలుకాని హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నడ్డా పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై వీధిపోరాటాలు చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, నిధుల వివరాలను నిరంతరం ప్రజలకు వివరించాలని ఆయన నాయకులకు మార్గదర్శనం చేశారు. నాయకత్వమంతా ఒకే బాటలో పయనిస్తూ తెలంగాణలో రాబోయే రోజుల్లో కమల వికాసానికి గట్టి పునాదులు వేయాలని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు.









