Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Middle East : అమెరికా -ఇరాన్ మధ్య మళ్లీ శాంతి చర్చలు..వచ్చే వారం ఇస్లామాబాద్ వేదికగా కీలక సమావేశం!

Peace Talks Between America-Iran
Peace Talks Between America-Iran

Middle East : పశ్చిమాసియాలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న సంక్షోభానికి తెరదించేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి చర్చల కోసం ముందుకు రాబోతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా వచ్చే వారం ఈ రెండు దేశాల ప్రతినిధుల మధ్య కీలకమైన రెండో దఫా శాంతి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

 ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సైనిక దాడులు, ప్రతిదాడులు పెరగడం.. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) లో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గత ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన మొదటి విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఆ తర్వాత జరగాల్సిన చర్చలు వాయిదా పడగా, ఇప్పుడు మళ్లీ ముందడుగు పడింది. ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దిష్ట గడువు లేకుండా పొడిగించారు.

వచ్చే వారం జరిగే సమావేశంలో ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో ఒక ఒప్పందానికి వచ్చేందుకు 14 అంశాలతో కూడిన ఒక ముసాయిదా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ 14 పాయింట్ల ప్రతిపాదనలలో ప్రధానమైన అంశాల్లో ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన (హైలీ ఎన్‌రిచ్డ్) యురేనియం నిల్వలను వేరే దేశానికి తరలించడం. ఇరాన్ అణు ఆయుధాల తయారీ వైపు వెళ్లకుండా కఠినమైన ఆంక్షలు విధించడం. చమురు రవాణాకు అంతరాయం కలగకుండా హోర్ముజ్ జలసంధి పునరుద్ధరించడం ఈ మార్గంలో ఉద్రిక్తతలను తగ్గించడం.: అణు నియంత్రణకు ఇరాన్ అంగీకరిస్తే.. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం.లెబనాన్ వంటి ఇతర ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలకు ముగింపు పలకడం వంటి అంశాలున్నాయి.

ఈ చర్చలు సఫలం కావడం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి. శాంతి ప్రక్రియను 30 రోజుల్లోగా పూర్తి చేసి యుద్ధానికి ముగింపు పలకాలని ఇరాన్ కోరుతుండగా.. రెండు నెలల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని అమెరికా ప్రతిపాదిస్తోంది. ఇరాన్ తనపై జరిగిన దాడులకు ఆర్థిక నష్టపరిహారం కోరుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలపై కొంత అసంతృప్తిగా ఉన్నారు. గత 47 ఏళ్లుగా మానవాళికి ఇరాన్ చేసిన నష్టానికి తగిన మూల్యం చెల్లించేంతవరకు పూర్తిస్థాయిలో ఆంక్షల సడలింపులు ఉండవని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా సంకేతాలు ఇచ్చారు.వచ్చే వారం ఇస్లామాబాద్‌లో జరగబోయే ఈ చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ చర్చలు సఫలమై ఈ 14 పాయింట్ల ఒప్పందం కుదిరితే, అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గడానికి మరియు అంతర్జాతీయ శాంతికి ఒక చారిత్రాత్మక ముందడుగు అవుతుంది.