S. Janaki : తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయనీ ఎస్ జానకి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జానకి తన 62 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందారు. గాన కోకిల, అపర గాన సరస్వతి, దక్షిణాది చిత్రసీమ ఐదు దశాబ్దాలకు పైగా మైమరిపించిన గాయనీమణి ఎస్. జానకి గారి అద్భుత స్వర ప్రస్థానం, ఆమె గాత్ర మహిమ మరియు సంగీత ప్రయాణంపై సమగ్ర కథనం..

నదులెన్నో ప్రవహిస్తున్నా గంగానది ప్రత్యేకతే వేరు. ఆ నది అనేక స్థలాలను స్పృశిస్తూ వాటిని దివ్య క్షేత్రాలుగా మార్చడమే కాకుండా, తన గమనాన్ని బట్టి పేర్లను కూడా మార్చుకుంటుంది. అలాగే చలనచిత్ర సీమలో నేపథ్య గాయనీమణులెందరో ఉన్నా ఎస్‌. జానకి గారి ప్రత్యేకత అద్వితీయం. ఎందరో సంగీత దర్శకుల బాణీలకు తన మధుర గాత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసి, వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన గాన సరస్వతి జానకమ్మ.గళంలో దివ్యమైన మాధుర్యం, తారా స్థాయిలను సునాయాసంగా అందుకోగల సత్తాతో పాటు, అరుదైన గాత్రానుకరణ (Mimicry/Voice Modulation) జానకమ్మ ప్రత్యేక శైలి. తన గాత్ర పరిణతితో ఆరేళ్ల పసిపాప మొదలు అరవై ఏళ్ల ముసలి అవ్వ వరకు ఆయా పాత్రల వయస్సుకు తగ్గట్టుగా జీవం పోశారు. శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం చూపినా, జానపదంలో ఊపు తెచ్చినా అది ఆమెకే చెల్లింది.

1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పాలపట్ల గ్రామంలో జన్మించిన జానకమ్మ, తండ్రి శ్రీరామమూర్తి ప్రోత్సాహంతో నాదస్వర విద్వాంసులు పైడిస్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 1957లో ఆల్ ఇండియా రేడియో పోటీల్లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత ఆమె చెన్నై ఎ.వి.ఎం. స్టూడియోలో స్టాఫ్ సింగర్‌గా ఎంపికయ్యారు. సాధారణంగా కొత్తగా వచ్చేవారు విషాద గీతాలకు దూరంగా ఉంటారు, కానీ జానకమ్మ ఏమాత్రం సంకోచించకుండా తన తొలి పాటను విషాద గీతంగానే పాడి ప్రయాణం ప్రారంభించారు. జానకమ్మ అపారమైన మేధస్సు తొలిసారిగా ‘మురిపించే మువ్వలు’ (1962) చిత్రంతో ప్రపంచానికి తెలిసింది. తమిళంలో ‘సింగార వేలనే దేవా’, తెలుగులో ‘నీ లీల పాడెదా దేవా…’ అనే పాటను నాదస్వర విద్వాంసుడు కారుకురిచ్చి అరుణాచలం ఊదిన శ్రుతికి సమానంగా, అత్యంత ఎత్తైన స్థాయిలో (High Pitch) పాడి సంగీత లోకాన్ని నివ్వెరపరిచారు. దిగ్గజ గాయని పి.లీల సైతం ఈ పాటను అంత పిచ్‌లో పాడటం కష్టమని జానకమ్మ పేరును సూచించడం విశేషం.

కేవలం నాదస్వరమే కాకుండా, శబ్ద తరంగాలతో పోటీపడే ఏ వాద్యంతోనైనా ఆమె గొంతు సమానంగా పలికేది. ‘సన్నాయి అప్పన్న’ (1980) చిత్రంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ వాద్యానికి అనుగుణంగా ‘కదిలించు నీ కలికి హృదయం’ పాటను పాడి హృదయాలను కరిగించారు. అలాగే ‘సప్తపది’ (1981)లోని ‘నెమలికి నేర్పిన నడకలివే’ పాటలో వేణునాదంతో పోటీ పడుతూ తన స్వర లయలను కురిపించారు.సాహిత్యపు అక్షరాలు లేకుండా కేవలం లయబద్ధమైన నవ్వుతో ఒక పాటను రక్తికట్టించడం సామాన్యమైన విషయం కాదు. ‘జ్యోతి’ (1976) చిత్రంలో చక్రవర్తి సంగీతంలో బాలుతో కలిసి పాడిన ‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు…’ పాటలో, బాలు పాడిన ప్రతి స్వరాన్ని జానకమ్మ తాళానికి అనుగుణంగా నవ్వుతోనే తిరిగినోటితో పలికించి రసిక హృదయాలను దోచుకున్నారు.

‘శంకరాభరణం’ చిత్రంలో పదేళ్ల బాలికగా నదీ తీరంలో చలికి వణుకుతూ పాడే సన్నివేశంలో శ్రుతి తప్పకుండా, అదే సమయంలో తడబడుతున్నట్టు పాడటం ఆమె గాత్ర పరిణతికి నిదర్శనం. అదే సినిమాలో ‘సామజ వర గమనా’ పాట పాడుతూ, పెళ్లిచూపుల్లో ప్రియుడిని చూసి పరవశించి నిషిద్ధ స్వరమైన రిషభాన్ని పలుకుతూ, శాస్త్రీయ రాగాన్ని ప్రణయ వికారంగా మార్చే భావాన్ని అద్భుతంగా పండించారు.‘సప్తపది’ చిత్రంలో ‘గోవుల్లు తెల్లన… గోపయ్య నల్లన’ పాటలో జానకమ్మ ప్రదర్శించిన వైవిధ్యం న భూతో న భవిష్యతి. ఇందులో ఒక గొంతు పదేళ్ల బాలుడిది కాగా, మరొకటి మూడేళ్ల పసిపాపది. శ్రుతి కుదరని మూడేళ్ల పాప అమాయకత్వాన్ని, కొద్దిగా శ్రుతి తెలిసిన పదేళ్ల అబ్బాయి గొంతును ఒకే పాటలో వేర్వేరుగా పలికించి శ్రోతలను అచ్చెరువొందించారు.

1964 లో వచ్చిన ‘పూజాఫలం’ చిత్రంలోని ‘శీలమింతైన విడువ జాలను రా’ అనే పదంలో జానకమ్మ ఒలికించిన గమకాలు గోదావరి తరంగాల కలకల స్వనాలకంటే మిన్నగా ప్రవహించాయి. ‘చిలక జోస్యం’లో ‘రాజ ఓ రాజ’ పాటలో అల్లు రామలింగయ్య, రమాప్రభల కోసం పాడేటప్పుడు ఆమె మత్తుగా నవ్విన తీరు, ‘శివ’ చిత్రంలోని ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలో ఒలికించిన శృంగారం జానకమ్మకే చెల్లింది.కథానాయకుడు పాడుతుంటే, కథానాయకి కేవలం ఊకొడుతూ (Humming) భావాలు వ్యక్తపరిచే శైలిని జానకమ్మ ఒక కళగా మార్చారు. ‘సిరి సంపదలు’ (1964)లో ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ’ పాటలో ఘంటసాల ప్రశ్నకు సమాధానంగా జానకమ్మ ఇచ్చిన ‘ఆ… ఊ… ఆహా’ అనే హమ్మింగ్స్ పాటలోని ఆత్మను ఆవిష్కరించాయి.

‘రావణుడే రాముడైతే’ చిత్రంలో ‘రవివర్మకే అందని’ పాటలో ప్రతి చరణాంతంలో తారా స్థాయిలో ఆమె చేసిన ఆలాపన ఒక స్వర చిత్రాన్ని కళ్లముందు ఉంచుతుంది. ‘ఆకలి రాజ్యం’లో నాయకుడు కవిత్వం చెప్పడానికి ‘తన్న నన్న నాన’ అంటూ ట్యూన్ ఇస్తూ, రకరకాల భావోద్వేగాలను కేవలం మూగ స్వరాలతో పలికించిన తీరు ఆమె అసాధారణ ప్రతిభకు తార్కాణం.‘శ్రీవారికి ప్రేమలేఖ’లో ప్రేమలేఖ రాస్తూ పలికించిన నిట్టూర్పులు, ‘శ్రీవారి శోభనం’ చిత్రంలో ‘అలక పానుపు ఎక్కనేల’ పాటలో ఒకవైపు పడుచు పిల్లగా, మరోవైపు ముసలి అవ్వగా గొంతు మారుస్తూ పాడిన తీరు అద్భుతం. ఒకే పాటలో ఇద్దరు వేర్వేరు వయస్సుల వ్యక్తుల సంభాషణను తన ఒక్క గొంతుతోనే నడిపించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

‘చంద్రహాస’ చిత్రంలో ‘ఓ వీణ చెలి నా ప్రియ సఖి’ పాటలో వీణానాదంతో మమేకమై పాడగా, ‘ఇల్లు ఇల్లాలు’ చిత్రంలో రాజబాబుతో కలిసి ‘వినరా సూరమ్మ కూతురు మగడా’ అంటూ హాస్యరసభరితమైన బుర్రకథను రక్తికట్టించారు. సీరియస్ శాస్త్రీయ సంగీతం నుంచి కడుపుబ్బ నవ్వించే హాస్య గీతాల వరకు ఏదైనా ఆమెకు హస్తగతమే. 80ల కాలంలో సంగీత రాక్షసుడు ఇళయరాజా, గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మల కాంబినేషన్ దక్షిణారభారతాన్ని ఊపేసింది. ‘అన్వేషణ’లోని ‘ఎదలో లయ ఎగసే లయ’, ‘నీరాజనం’లోని ‘నిను చూడక నేనుండలేను’ పాటలలో బాలు గాత్రానికి పోటీగా జానకమ్మ ఒలికించిన ఆలాపనలు సంగీత ప్రియులకు అమృతాభిషేకం చేశాయి.

తొలినాళ్లలో ‘ఎం.ఎల్.ఏ’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘నీ ఆశ అడయాస’తో తెలుగు ప్రయాణం ప్రారంభించినా, స్థిరపడటానికి కొంత సమయం పట్టింది. అప్పటికే పి. సుశీల గారు అగ్ర కథానాయికలకు పాడుతుండగా, జానకమ్మ సెకండ్ గ్రేడ్ పాత్రలకు పాడుతూ తన సత్తా నిరూపించుకున్నారు. 1961లో ‘బావామరదళ్లు’లోని ‘నీలి మేఘాలలో’, 1964లో ‘పూజాఫలం’లోని ‘పగలే వెన్నెలను’ పాటలతో తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.సావిత్రి, అంజలీదేవి, జమునల కాలం నుంచి ప్రారంభించి జయప్రద, జయసుధ, శ్రీదేవి, రాధికల మీదుగా విజయశాంతి, సౌందర్య, రంభ వరకు దాదాపు ఐదు తరాల కథానాయికలకు జానకమ్మ గాత్రదానం చేశారు. లలిత గీతాలైనా, జానపదాలైనా, క్లబ్ డాన్స్ వ్యాంప్ సాంగ్స్ అయినా ఎల్.ఆర్. ఈశ్వరి తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన ఏకైక గాయని ఎస్. జానకి గారే.

పాటలు పాడటంలోనే కాకుండా స్వరకల్పనలోనూ తన ముద్ర వేశారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌనపోరాటం’ చిత్రానికి ఎస్. జానకి గారు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా చరిత్రలో భానుమతి, పి. లీల గారి తర్వాత సంగీత దర్శకురాలిగా మారిన మూడో మహిళగా జానకమ్మ చరిత్రకెక్కారు. పది నంది అవార్డులు, నాలుగు జాతీయ అవార్డులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 25కు పైగా అవార్డులు ఆమెను వరించాయి. ‘సితార’ చిత్రంలోని ‘జిలిబిలి పలుకులకు’ పాట ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’, కర్ణాటక ప్రభుత్వ ‘బసవభూషణ’ బిరుదులతో పాటు మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.

దశాబ్దాల పాటు సంగీత లోకాన్ని ఏలిన తనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ఆలస్యంగా ‘పద్మభూషణ్’ ప్రకటించడాన్ని నిరసిస్తూ, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని భావించి ఆ అవార్డును తిరస్కరించిన ధీర వనిత జానకమ్మ. కళాకారులకు దక్కాల్సిన గౌరవం సమయానుకూలంగా, ప్రాధాన్యతతో ఉండాలని ఆమె ఆత్మగౌరవంతో నినదించారు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్, జపనీస్ వంటి పలవు విదేశీ భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడిన ఎస్. జానకి గారు సంగీత ప్రపంచానికి లభించిన అమూల్యమైన నిధి. ఆమె స్వర జలపాతం సదా ప్రవహిస్తూనే ఉంటుంది, ఆమె గానం భారతీయుల గుండెల్లో నవ వసంతాలను పూయిస్తూనే ఉంటుంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.