
Abhijeet Dipke: దేశ రాజధాని నగరమైన ఢిల్లీ వేదికగా తీవ్ర స్థాయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET),ఇతర పోటీ పరీక్షల లీకేజీలు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిర్వహించిన ‘ఛలో సంసద్’ (పార్లమెంట్ మార్చ్) ఉద్రిక్తతలకు దారితీసింది. వేలాది మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించడంతో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ ఆందోళనల్లో కీలక పరిణామంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దిప్కే (Abhijeet Dipke) ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పార్లమెంట్ మార్చ్‌కు నాయకత్వం వహించకుండా అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ నిరసనకారులను నిర్బంధించారు. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులు బలప్రయోగం చేయడాన్ని, తమ నాయకుడిని అరెస్ట్ చేయడాన్ని సీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
మరోవైపు నీట్ పరీక్షల లీకేజీపై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేసి తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూలై 18న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వాంగ్చుక్కు మద్దతుగా, విద్యార్థుల గళాన్ని నొక్కేస్తున్నారని నిరసిస్తూ అభిజిత్ దిప్కే జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
Also Read : చలో పార్లమెంట్ ఉద్రిక్తత.. జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిథుల భేటీ
అయితే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వం నుంచి చర్చల ప్రతిపాదనలు వచ్చాయనే సమాచారంతో అభిజిత్ దిప్కే సోమవారం ఉదయం నిమ్మరసం తాగి తన నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించారు. తదుపరి చర్చలకు మార్గం సుగమం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేపీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి.
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో రాళ్లతో నిండిన ఒక సందేహాస్పద ట్రక్కు నిలిపి ఉంచడం తీవ్ర కలకలం రేపింది. శాంతియుత నిరసనగా సాగుతున్న తమ కార్యక్రమాన్ని భంగపరిచేందుకు, ఉద్రిక్తతలు సృష్టించేందుకే ఈ రాళ్ల ట్రక్కును అక్కడ ఉంచారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అత్యంత భద్రత ఉండే పరిధిలో నిరసనకారులకు సమీపంలో ఈ ట్రక్కు ఉండటం భద్రతా ఆందోళనలకు దారితీసింది.
అంతకుముందు, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు,యువత డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం తమను సంప్రదించిందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యేందుకు బయలుదేరారు. అయితే, తాము ఎలాంటి చర్చలకూ పిలవలేదని జేపీ నడ్డా కార్యాలయం ఈ ప్రకటనను మొదట ఖండించడంతో తీవ్ర అయోమయం నెలకొంది.
అయినప్పటికీ, నడ్డా నివాసానికి చేరుకున్న సీజేపీ నేతలను దాదాపు రెండు గంటల పాటు నిరీక్షించిన అనంతరం జేపీ నడ్డా కలిశారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి సమర్పించారు. కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే సాగిన ఈ భేటీ అనంతరం, సీజేపీ ప్రతిపాదనలపై పార్టీ నాయకత్వంతో అంతర్గతంగా చర్చిస్తున్నట్లు జేపీ నడ్డా తెలిపారని అశుతోష్ రాంకా వెల్లడించారు.
ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన వేలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకునేందుకు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల బలగాలు నిరసనకారులపై బాష్పవాయువు (టియర్ గ్యాస్) గోళాలు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి. ఈ తోపులాట, లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులు, ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఊహించని పరిణామాలతో ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు పార్లమెంట్ ప్రధాన గేట్లను పూర్తిగా మూసివేసి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వెలుపల వేలాది మంది విద్యార్థుల నిరసనలు, లాఠీచార్జ్ , తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో లోక్‌సభ, రాజ్యసభ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర శాంతిభద్రతల సమస్య నెలకొనడంతో విద్యార్థులపై కఠినమైన బలప్రయోగాన్ని తక్షణమే ఆపాలని, అదుపులోకి తీసుకున్న అభిజిత్ దిప్కేతో పాటు ఇతర యువతను వెంటనే విడుదల చేయాలని సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేయడంతో ఢిల్లీలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.
Also Read : ఢిల్లీలో హైఅలర్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సీజేపీ నేతలు అరెస్ట్!









