Canada New Rules :  కెనడాలో చదవాలనే కల లక్షలాది విద్యార్థులకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కల నిజం కావడం చాలా కష్టంగా మారుతోంది. ఒకప్పుడు మన విద్యార్థులు వెళ్లడానికి ఇష్టపడే కెనడా దేశం.. ఇప్పుడు స్టూడెంట్ వీసాలపై గట్టి ఆంక్షలు పెడుతోంది. దీంతో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.

కెనడా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల వల్ల విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. దీని ప్రభావం మన విద్యార్థులపై స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఏప్రిల్‌లో మన వారికి 36,510 స్టడీ పర్మిట్లు రాగా.. 2025 ఏప్రిల్‌లో ఆ సంఖ్య 6,895కి పడిపోయింది. ఇక 2026 ఏప్రిల్ నాటికి అది మరింత తగ్గి 5,795కి చేరుకుంది. ఇందులో కొత్త పర్మిట్లతో పాటు పాతవి పొడిగించుకున్నవి కూడా ఉండే అవకాశం ఉంది. 2025 నాటికి విదేశాల్లో చదువుతున్న సుమారు 12 లక్షల 54 వేల మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది కెనడాలోనే ఉన్నారు.  ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.

Also Read : యథావిధిగా సింధూజలాల ఒప్పందం కుదరదు…పాక్ కు తేల్చి చెప్పిన భారత్

ఒకప్పుడు కెనడాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మన దేశం వారే ఎక్కువగా ఉండేవారు. 2015లో మొత్తం విద్యార్థుల్లో మన వాటా 14.6 శాతమే ఉండగా, 2018 నాటికి చైనాను వెనక్కి నెట్టి మనమే మొదటి స్థానానికి వెళ్లాం. 2022లో ఈ సంఖ్య 41.2 శాతానికి పెరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. 2025 నాటికి మన వాటా 24.6 శాతానికి పడిపోయింది. 2023లో కెనడాలో దాదాపు 2 లక్షల 78 వేల మంది మన విద్యార్థులు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 93,915కి తగ్గిపోయింది. ఇదే సమయంలో మన విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురయ్యే శాతం కూడా భారీగా పెరిగింది.

డబ్బుల నిబంధనల విషయానికి వస్తే, జీవన వ్యయం కోసం చూపించాల్సిన నిధుల పరిమితి రెట్టింపు అయింది. ట్యూషన్ ఫీజులతో పాటు, విద్యార్థులు తమ మొదటి సంవత్సర ఖర్చుల కోసం కనీసం 20,635 కెనడియన్ డాలర్లు (సుమారు 12.5 లక్షల రూపాయలు) బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు చూపించాలి.

ఇది ఒక్క కెనడా సమస్యే కాదు.. మన విద్యార్థులు ఎక్కువగా వెళ్లే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కూడా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌కు వెళ్లే మన విద్యార్థుల సంఖ్య తగ్గింది. అలాగే ఆస్ట్రేలియా మన దేశ విద్యార్థుల వీసా దరఖాస్తులను హైయెస్ట్ రిస్క్ గా మార్చింది. ఈ పరిణామాలు విదేశాల్లో చదవాలనుకునే మన విద్యార్థులకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అందువల్ల ఏ కోర్సు చదవాలి, ఏ దేశానికి వెళ్లాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, నిబంధనలు ఎలా మారుతున్నాయి అనే విషయాలను ముందుగానే క్షుణ్ణంగా తెలుసుకుని అడుగువేయడం ఇప్పుడు చాలా ముఖ్యం.

Also Read : హమాస్ కొత్త అధినేతగా ఖలీల్ అల్-హయ్యా…ఆయన గురించి తెలిస్తే షాక్..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.