Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా అమెరికా-ఇరాన్ మధ్య వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ విషయంలో సౌదీ అరేబియాకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

ఈ కొత్త అణు ఒప్పందం ప్రకారం, సౌదీ అరేబియా తన దేశంలో పౌర అవసరాల కోసం చేపట్టే అణుశక్తి కార్యక్రమానికి అవసరమైన యురేనియంను స్వదేశంలోనే శుద్ధి చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ ఒప్పందాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

ఈ అణు ఒప్పందం 30 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. సౌదీ అణు కార్యక్రమాల అభివృద్ధిలో అమెరికా కంపెనీలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. అమెరికా-సౌదీ సంయుక్త అధ్యయనం పూర్తయ్యాక సౌదీలో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే మార్గం కూడా సుగమం కానుంది.

ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య చాలా కాలంగా ప్రాంతీయ ఆధిపత్య పోటీ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సౌదీకి యురేనియం శుద్ధీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల పశ్చిమ ఆసియాలో శక్తి సమతుల్యత మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధక అంశాలపై పనిచేసే నిపుణులు మాత్రం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం శుద్ధీకరణ నేరుగా అణ్వస్త్రాల తయారీకి దారితీయకపోయినా, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధికి మార్గం సుగమం చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కూడా గతంలో ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దారిలో అడుగులు వేస్తుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంతకుముందు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ సౌదీతో అణు సహకార ఒప్పందం కోసం ప్రయత్నించారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాతో 123 అగ్రిమెంట్ కింద అణుశక్తి ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ, యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ హక్కును మాత్రం కోరలేదు. అందుకే యూఏఈ మోడల్‌ను అణు సహకారంలో అత్యంత సురక్షిత నమూనాగా భావిస్తారు.

ఇప్పటికే సౌదీ అరేబియా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పాకిస్థాన్‌తో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసింది. ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి కూడా అవసరమైతే తమ అణు కార్యక్రమాన్ని సౌదీకి అందుబాటులో ఉంచే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కేవలం ఇంధన అవసరాలకే పరిమితం కాకుండా, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానూ, పశ్చిమ ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలకు సంకేతంగానూ విశ్లేషకులు భావిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.