BIG BREAKING :  ఢిల్లీలో కొనసాగుతున్న కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, ఐటీఓ, ఖాన్ మార్కెట్‌తో పాటు మొత్తం 16 మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేశారు.

డీఎంఆర్‌సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జనపథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లు మూసివేశారు. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సౌకర్యం మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటుందని డీఎంఆర్‌సీ స్పష్టం చేసింది.

ఇదే తరహాలో సోమవారం కూడా సీజేపీ ఇచ్చిన చలో పార్లమెంట్ పిలుపుతో వేలాది మంది కేంద్ర ఢిల్లీకి చేరుకోవడంతో పలు మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. విద్యార్థులపై పోలీసుల చర్యలను సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించాలని న్యాయవాది కోరారు. అయితే దీనిని ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ, మా సమయాన్ని వృథా చేయకండి… మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి అని న్యాయవాదికి సూచించారు.

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.