
NSA Act : ఢిల్లీలో సిజెపి (CJP) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం (NSA) అధికారాలను కట్టబెట్టారంటూ వస్తున్న వార్తలపై ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ప్రచారంలో ఉన్న వార్తలను ఖండిస్తూ, ఈ ఉత్తర్వులు కేవలం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. ఆందోళనలను అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి మూడు నెలలకొకసారి పోలీస్ కమిషనర్‌కు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA), 1980 కింద ఇచ్చే ముందస్తు నిర్బంధ అధికారాలను (Preventive Detention Powers) పునరుద్ధరించారని, ఇది క్రమం తప్పకుండా జరిగే పొడిగింపు మాత్రమేనని స్పష్టం చేశారు.
Also Read : దేశ రాజధానిలో మెట్రో స్టేషన్ల మూసివేత…జోక్యం చేసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరిక
#Breaking: The Centre has allowed the Delhi Police Commissioner to detain people under the National Security Act (NSA) from July 19 to October 18. Under this law, anyone can be jailed, without any charges or trials for up to a year if police believe it is necessary to prevent a… pic.twitter.com/lsfG6a5hXK
— Srishti (@seekingsrishti) July 23, 2026
జూలై 19 నుంచి అక్టోబర్ 18, 2026 వరకు మూడు నెలల కాలానికి ఈ అధికారాలను పునరుద్ధరిస్తూ ఢిల్లీ ఎల్జీ ఈ నెల ప్రారంభంలో (జూలై 07న) ఉత్తర్వులు జారీ చేశారు. సిజెపి నిరసనలు తీవ్రరూపం దాల్చడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తయిందని పోలీసులు తెలిపారు. “సిజెపి ఆందోళనలను అణచివేయడానికే సిపికి ఎన్ఎస్ఏ అధికారాలు ఇచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే తప్ప, ఇతర ఉద్దేశాలు లేవు” అని ఢిల్లీ పోలీసులు గురువారం ఓ ప్రకటనలో వివరించారు.
మరోవైపు జంతర్ మంతర్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. సంసద్ మార్గ్, ద పార్క్ హోటల్ సమీపంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి చేయిదాటిపోకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : ప్రభుత్వం హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ కండిషన్స్
రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు కన్నాట్ ప్లేస్ ప్రధాన రహదారి వరకు వెంటాడారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలు నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించాయి. దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల లీకేజీలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఈ యువజన ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ కాక్రోచ్ జనతా పార్టీని బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అభిజీత్ దిప్కే ప్రారంభించారు. గత మే నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యంగ్యాత్మకంగా మొదలైన ఈ క్యాంపెయిన్, ప్రస్తుతం దేశంలో పరీక్షల అక్రమాలపై పోరాడే అతిపెద్ద యువజన ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ ఉద్యమానికి విద్యార్థులు, యువత నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
జూన్ 20న జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన సిజెపి నిరసనకు జూన్ 28న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపారు. ఆయన నిరసన ప్రదేశంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గత వారాంతంలో అధికారులు ఆయనను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన నిరసనకారులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.









