High drama in New Delhi : ఢిల్లీ వేదికగా విపక్షాలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలతో జాతీయ రాజధానిలో రాజకీయ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. నీట్‌ (NEET) పేపర్‌ లీకేజీ, దానివల్ల తీవ్ర మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, విద్యావ్యవస్థలో పేరుకుపోయిన లోపాలపై కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.ఈ పరిణామాలపై స్పందించిన విపక్ష ‘ఇండి’ (INDIA) కూటమి, ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు, యువతకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఢిల్లీలోని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాసంలో ‘ఇండి’ (INDIA) కూటమి అగ్రనేతలు సమావేశమయ్యారు. నీట్‌ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యావ్యవస్థలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల పోరాటానికి ఏకగ్రీవంగా బాసటగా నిలవాలని నిర్ణయించారు.ఈ భేటీ అనంతరం, లీకేజీల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల స్మారకార్థం, అలాగే పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన నిరసనకారులకు మద్దతుగా గాంధీ స్మృతి కేంద్రం వద్ద శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన (Candlelight Vigil) నిర్వహించేందుకు నేతలు బయలుదేరారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర విపక్ష ఎంపీలంతా ఒకే బస్సులో గాంధీ స్మృతి, రాజ్‌ఘాట్ వైపు పయనమయ్యారు. అయితే, వారి బస్సును పోలీసులు రాహుల్ నివాసం వెలుపలే భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా నెలకొంది. కార్యకర్తల నినాదాలు: పోలీసుల తీరుకు నిరసనగా అక్కడికి చేరుకున్న ప్రతిపక్ష కార్యకర్తలు బస్సును చుట్టుముట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఢిల్లీలో వర్షం కురుస్తున్నప్పటికీ నేతల నిరసన వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ “పోలీసు బలగాలను చూపి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ మేము దేనికీ భయపడం. ఈ దేశం మనదే, ఎక్కడికైనా వెళ్తాం” అని మండిపడ్డారు.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలకు విపక్ష ఎంపీలు పూర్తి సంఘీభావం తెలిపారు.మరొకవైపు, నీట్ లీకేజీల వల్ల విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంపై బాలీవుడ్ నటి నోరా ఫతేహి తీవ్రంగా చలించిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సాగుతున్న ఈ పోరాటానికి ఆమెతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం మద్దతు పలకడం గమనార్హం.

ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న జంతర్ మంతర్ ప్రాంతంలో భద్రతను దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఆంక్షలను కఠినతరం చేసింది.జంతర్ మంతర్ పరిసరాల్లో దాదాపు 1.5 కిలోమీటర్ల పరిధిలో అర్థరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.జులై 17 నుంచి ఇప్పటివరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడం ఇది ఐదోసారి.

ఈ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, విద్యార్థులకు ధైర్యం చెప్పారు.”దేశంలో విద్యార్థులు ఎవరూ ఒంటరి వారు కారు. మీ హక్కుల పోరాటంలో విపక్షాలన్నీ పూర్తి స్థాయిలో అండగా ఉంటాయి. పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించేందుకు, గాయపడిన వారికి మద్దతుగా నిలిచేందుకు గాంధీ స్మృతికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే మా పోరాటం ఆగదు” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.