
Indiramma Indlu :హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ టవర్స్ పథకానికి శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆకాంక్షలకు అనుగుణంగా, క్యూర్ (CURE) పరిధిలో అల్పాదాయ వర్గాలకు నగర నడిబొడ్డున గౌరవప్రదమైన నివాసాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకానికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి గందరగోళం, అపోహలు లేదా మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్‌లైన్‌ను హౌసింగ్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం అధికారికంగా ప్రారంభించారు.
ఈ పథకం కింద హైదరాబాద్ క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, తొలివిడతలో భాగంగా 16 నియోజకవర్గాల పరిధిలో 7,680 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుండటంతో, ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అర్హులైన అభ్యర్థులు మీ సేవ కేంద్రాలు, అధికారిక ఆన్లైన్ పోర్టల్ లేదా వాట్సాప్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజలు ఏమైనా సందేహాలుంటే నేరుగా 040-24603572 నంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫోన్ చేయవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఈ హెల్ప్‌లైన్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో అధికారిక సమాచారాన్ని అందిస్తారు.
ఇందిరమ్మ టవర్స్ పథకానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన అర్హత ప్రమాణాలను ఖరారు చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే కుటుంబ వార్షిక ఆదాయం ₹6.00 లక్షల వరకు మాత్రమే ఉండాలి. అలాగే దరఖాస్తుదారులు క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివాసం ఉంటుండాలి. అంతేకాకుండా దరఖాస్తుదారునికి గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ ఓఆర్ఆర్ (ORR) లేదా క్యూర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తుకు మాత్రమే అవకాశముంటుందని, అర్హత సాధించిన కుటుంబానికి కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయించబడుతుందని స్పష్టం చేశారు.
దరఖాస్తు ప్రక్రియను వీలైనంత సులభతరం చేస్తూ ప్రజలపై పత్రాల సమర్పణ భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. ప్రాథమిక దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కేవలం తమ ఆధార్ సంఖ్యను తెలియజేస్తే సరిపోతుంది. కుల ధృవీకరణ పత్రాలు లేదా జీతభత్యాల ధృవీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు; వీటిని లాటరీ ఎంపిక పూర్తయిన తర్వాత సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన ₹10,000 ఇఎండి (EMD) మొత్తాన్ని కేవలం UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ డ్రాలో ఇల్లు మంజూరు కాకపోతే, ఆ మొత్తం నేరుగా దరఖాస్తుదారుని బ్యాంక్ ఖాతాకే తిరిగి వాపసు అవుతుంది. అందువల్ల పరిశీలన, కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు మీసేవ రశీదు, దరఖాస్తు సంఖ్య, మొబైల్ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలి.
ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ఈ ఇందిరమ్మ టవర్స్ ప్రతి ఫ్లాట్ సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ (1BHK) సదుపాయాలతో నిర్మించబడుతోంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఫ్లాట్ విలువ సుమారు ₹40 లక్షల నుంచి ₹60 లక్షల వరకు ఉంటుంది. అయితే పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ₹5 లక్షల సబ్సిడీని అందించడంతో పాటు, అన్‌డివైడెడ్ షేర్ (UDS) కింద 20 నుంచి 25 గజాల విలువైన స్థలాన్ని కూడా లబ్ధిదారుని పేరిటే రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. దీనివల్ల అర్హులైన లబ్ధిదారుడు కేవలం ₹6 లక్షల నామమాత్రపు మొత్తాన్ని మాత్రమే చెల్లించి నగర నడిబొడ్డున విలువైన సొంతింటిని సొంతం చేసుకునే అద్భుత అవకాశం దక్కుతుంది.
దరఖాస్తుల పరిశీలన, ఇళ్ల కేటాయింపు ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుంది. అందిన దరఖాస్తులను డిజిటల్ స్క్రీనింగ్‌తో పాటు క్షేత్రస్థాయి సమగ్ర విచారణ ద్వారా ధృవీకరిస్తారు. అందుబాటులో ఉన్న ఫ్లాట్ల సంఖ్య కంటే అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే, పూర్తిగా పారదర్శకమైన కంప్యూటరీకృత లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మధ్యవర్తుల వ్యాఖ్యలను, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ను మాత్రమే సంప్రదించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









