Thursday, May 21, 11:47
34.2 C
Hyderabad

Russia Ukraine War : రష్యాతో ఒడువని యుద్ధం..ఉక్రెయిన్ సైనికుల ఆకలి పోరాటం

Russia Ukraine war
Russia Ukraine war

Russia Ukraine war : యుద్ధరంగంలో ఉక్రెయిన్‌ సైనికులు రష్యా బలగాలతోనే కాదు, అంతకన్నా ప్రమాదకరమైన ఆకలిదప్పులతోనూ పోరాడుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చాలా రోజులుగా తిండిలేక, పోషకాహార లోపంతో ఎముకలగూడును తలపించేలా మారిన నలుగురు ఉక్రెయిన్‌ సైనికుల ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమై ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేశాయి. ఆ సైనికులు ఏకంగా 17 రోజులుగా కనీసం ఒక్క ముద్ద ఆహారానికి కూడా నోచుకోలేదని, అనేక నెలలుగా వారికి రేషన్‌ అందడం లేదని సమాచారం అందుతోంది.

రష్యన్‌ ఆత్మాహుతి డ్రోన్ల నిరంతర నిఘా కారణంగా సైనికులకు తేలికగా ఆహారం, మందులు లేదా ఇతర అత్యవసర సరఫరాలు అందించే పరిస్థితి లేకుండా పోయింది. రోబోటిక్‌ కార్ట్‌ల సాయంతో సైనికులకు ఆహార పొట్లాలు పంపే వీలున్నప్పటికీ, వాటిని నడిపించడానికి ఉక్రెయిన్ డ్రోన్ల మార్గదర్శకత్వం అవసరం అవుతుంది. అయితే ఆ ఉక్రెయిన్ డ్రోన్లు గనుక రష్యా నిఘా కంటపడితే, ఆ రోబోటిక్ కార్ట్‌లతో పాటు బంకర్లలో దాక్కున్న సైనికుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుందని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ భయానక పరిస్థితుల వల్ల సైనికులు ఆకలిని తట్టుకోలేక యుద్ధరంగంలోనే స్పృహ కోల్పోవడం సర్వసాధారణంగా మారింది.

ఆకాశంలో నిరంతరం తిరిగే రష్యా డ్రోన్లు సైనికుల కదలికలను పూర్తిగా కట్టడి చేయడంతో, వారు బంకర్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఓలెక్సాండర్‌ అనే సైనికుడు మాట్లాడుతూ.. “తీవ్రమైన ఆకలి అంటే ఏమిటో మాతృభూమి కోసం పోరాడుతూ అర్థం చేసుకున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరారంభంలో ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని ఒక బంకర్‌లో ఏకాకిగా చాలాకాలం గడిపిన సమయంలో, తన కుటుంబం కంటే ఎక్కువగా.. ఒక పూట వేడివేడి భోజనం దొరికితే చాలని కలలు కన్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, రష్యా దళాలు ఉక్రెయిన్‌పై చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఒకదానికి తెరతీశాయి. ఉక్రెయిన్‌లోని దాదాపు 20 కీలక ప్రాంతాలపై బుధవారం ఉదయం ఏకంగా 800 డ్రోన్‌లతో రష్యా విరుచుకుపడిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘోర దాడిలో ఇప్పటివరకు ఆరుగురు పౌరులు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా దళాలు ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను, సరఫరాలను దెబ్బతీసేందుకు పౌర,మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని జెలెన్‌స్కీ మండిపడ్డారు. మధ్య ద్నిప్రో, ఈశాన్య ఖార్కివ్‌ ప్రాంతాలపై జరిగిన దాడిలో పౌర నివాసాలతో పాటు ఉక్రెయిన్ రవాణాకు కీలకమైన రైల్వే సదుపాయాలు పూర్తిగా నాశనమయ్యాయి. అలాగే వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్న ఒడెసా రేవు (Port) ప్రాంతంపై రష్యా డ్రోన్లు దాడి చేయడంతో అక్కడి ఓడరేవు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వణికిపోతున్న ఉక్రెయిన్ నగరాలు

ప్రస్తుతం కీవ్‌, ఎల్విన్‌, ఒడెసా వంటి పెద్ద నగరాలపై రష్యా ఏకకాలంలో దాడులు చేస్తూ వస్తోందని, మంగళవారం కూడా దాదాపు 14 ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించిందని ఉక్రెయిన్ ధృవీకరించింది. ఒకవైపు సరిహద్దుల్లో ఆకలితో అలమటిస్తున్న సైనికులు, మరోవైపు నగరాలపై వందలాది డ్రోన్ల దాడులతో సామాన్య ప్రజల మరణాలతో ఉక్రెయిన్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.