CM Revanth Reddy :  రాష్ట్రంలో ఆరుతడి పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను భారీ సబ్సిడీపై రైతులకు అందించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన సమగ్ర నివేదికను ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారంలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. రసాయనాలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. అంతేకాకుండా, రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ నుంచి ప్రత్యేకంగా ఎక్స్‌టెన్షన్ అధికారులను నియమించి తగిన సలహాలు ఇవ్వాలని చెప్పారు.

ఈ సమావేశంలో కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు, దానివల్ల పంటలపై పడుతున్న ప్రభావం, ఈ సీజన్‌లో తగ్గిన సాగు విస్తీర్ణం వంటి వివరాలతో పాటు అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను పొందుపరిచారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని నివేదిక సిఫారసు చేసింది. గ్రామాల వారీగా ప్రత్యేక అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు మరియు కూరగాయల సాగును ప్రోత్సహించాలని పేర్కొంది.

ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను 75 శాతం రాయితీతో అందించాలని, అదేవిధంగా ప్రత్యామ్నాయ సాగు చేపట్టే రైతులకు కొత్తగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని కమిటీ సూచించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందించాలని, హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును పెంచి అక్కడి నుంచి నేరుగా రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం డైరీ యూనిట్లను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించాలని, ఈ అత్యవసర చర్యలన్నింటినీ పర్యవేక్షించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నివేదిక ద్వారా ప్రభుత్వానికి నిపుణుల కమిటీ విజ్ఞప్తి చేసింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.