Delhi Police : ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన ఒక మైనర్ బాలికపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. గత నెలలో జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి నోయిడా పోలీసులు ఆ బాలికపై మొదట జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ సమయంలో ఆమె వయస్సును 25 ఏళ్లుగా ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. అయితే, ఆ తర్వాత ఆ బాలిక ఒక క్షమాపణ వీడియోను విడుదల చేస్తూ అసలు నిజం బయటపెట్టింది.

తాను కేవలం 15 ఏళ్ల బాలిక అని, ఆందోళన ప్రాంతంలో కొందరి ప్రభావం వల్లే తాను అలా మాట్లాడానని ఆ వీడియోలో ఆమె స్పష్టం చేసింది. తాను చేసింది క్షమించరాని తప్పు అని, చాలా చెడు మాటలు మాట్లాడానని ఆ బాలిక చెప్పుకొచ్చింది. ఇది తన మొదటి, చివరి తప్పు అని, దేశం మొత్తం క్షమించాలని వేడుకుంది. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, తన ముఖం తాను చూసుకోలేకపోతున్నానని, దయచేసి తనను క్షమించాలని ఆమె ఆ వీడియోలో ఏడ్చేసింది.

సోషల్ మీడియాలో ఆ బాలికకు క్షమాభిక్ష పెట్టాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తప్పుదారి పట్టిన పిల్లలు తనను దూషిస్తే తాను క్షమిస్తానని ఆయన తెలిపారు. పిల్లలను శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెట్టడం వల్ల ఎలాంటి మార్పు రాదని మోదీ పేర్కొన్నారు. తాను వారిని క్షమించాలనుకుంటున్నానని, తాను చెప్పేదాన్ని సమాజం కూడా అంగీకరించాలని ఆయన వీడియోలో కోరారు.

Also Read : కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. 18 మంది ప్రమాణస్వీకారం

తమ కూతురిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని ఆ మైనర్ బాలిక తల్లి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దేశ పుత్రిక తప్పుగా మాట్లాడినా పెద్ద మనసుతో ప్రధాని మోదీ ఆమెను క్షమించారని, ఆయనకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నానని తల్లి చెప్పారు. ప్రధాని తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తప్పు పేరు, వయస్సుతో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ఇప్పుడు తమ బిడ్డ పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే ఉంటుందని ఆమె కోరారు.

అలాగే, 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాను నిలిపివేయాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పిల్లలు కేవలం చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావాలని, ఇలాంటి నిరసన ప్రదర్శన జరిగే ప్రాంతాలకు వారిని అనుమతించకూడదని ఆమె కోరారు. చిన్న పిల్లలను కొందరు సులభంగా మోసం చేసి వాడుకుంటారని, వారికి ప్రపంచం గురించి ఏమీ తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఐదు వారాలకు పైగా నిరసన తెలిపింది. ఈ వ్యంగ్య సోషల్ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు మద్దతుగా నిలిచారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు, ఆందోళనకారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం అంగీకరించడంతో ఆ గ్రూప్ గత నెలలో తమ నిరసనను విరమించుకుంది.

Also Read : లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్‌ భూషణ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.