
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొత్త దిగుమతి సుంకాల నిర్ణయం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 60 భాగస్వామ్య దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం కఠినమైన పన్నులను విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ అమెరికాలోని 25 రాష్ట్రాలు ఒకటై ప్రెసిడెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగాయి. ట్రంప్ ప్రభుత్వం తమకు ఇచ్చిన అధికార పరిమితులను దాటి, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ‘యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో ఈ డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రాల కూటమి సంయుక్తంగా ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది.
Also Read : అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం: దౌత్య చర్చల దిశగా ట్రంప్ అడుగులు
వివిధ దేశాల్లో తయారుచేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధాన్ని అమలు చేయడం లేదని ట్రంప్ సర్కార్ ఈ కొత్త టారిఫ్‌లను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వివిధ భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు అదనపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వైట్‌హౌస్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల అమెరికాలోని స్థానిక వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు పూర్తిగా దెబ్బతింటాయని రాష్ట్రాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. అంతేకాకుండా విదేశీ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ భారం అంతా చివరికి సామాన్య ప్రజలపైనే పడుతుందని.. ఇది తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని 25 రాష్ట్రాల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రారంభంలో భారత్‌పై 12.5 శాతం సుంకం విధించాలని ట్రంప్ యంత్రాంగం భావించింది. కానీ ఈ వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు. అలా తమ సొంత దేశ ప్రయోజనాలు, దౌత్యపరమైన బంధాలను దృష్టిలో ఉంచుకుని చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులతో పాటు ‘యూఎస్-మెక్సికో-కెనడా’ వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే అత్యవసర వస్తువులకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, గ్లోబల్ సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం చూపే ఈ వివాదం ఇప్పుడు అమెరికా న్యాయస్థానంలో తేలనుంది. గతంలో కూడా ట్రంప్ ప్రభుత్వం విధించిన పలు వివాదాస్పద సుంకాల నిర్ణయాలు కోర్టుల్లో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 25 రాష్ట్రాలు ఒకేసారి కలిసి వచ్చి దాఖలు చేసిన ఈ కేసు ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న మొండి వాణిజ్య విధానాలకు ఒక పెద్ద సవాలుగా మారింది.
Also Read : ప్రపంచానికి మరో పెనుముప్పు: ‘సజీవ నోస్ట్రాడామస్’ అథోస్ సలోమ్ సంచలన హెచ్చరికలు









