Father Funeral :  తల్లిదండ్రులు తమ పిల్లలే తమ ప్రపంచం అని బతుకుతుంటారు. వారి కోసం పగలూ రాత్రీ కష్టపడతారు. ఓ రకంగా చెప్పాలంటే పిల్లల కోసం తమ జీవితాన్నే త్యాగం చేస్తారు. కానీ అందుకు బదులుగా ఆ పిల్లలు తల్లిదండ్రులపై విలువ చూపించకపోవడం చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. హరియాణాలో ఓ తండ్రి చనిపోతే అతని ముగ్గురు కూతుళ్లు ఆన్ లైన్ లో అంత్యక్రియలకు హాజరయ్యారు.

ఒకప్పుడు ముంబైలో కోట్లాది డాలర్ల వస్త్ర వ్యాపారం చేసిన సోనిపత్‌కు చెందిన వృద్ధుడైన శివచరణ్ గుప్తా తన జీవితమంతా కుటుంబానికే అంకితం చేశారు. అయితే, తన చివరి రోజుల్లో ఆయన ఒక నర్సింగ్ హోమ్‌లో నివసించవలసి వచ్చింది. ఇక ఆయన తుది శ్వాస విడిచే సమయానికి, ఆయన ముగ్గురు కుమార్తెలు కూడా ఆయనతో లేరు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Also Read : ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు!

ఖర్చుల కోసం 5,500 రూపాయలు

శివచరణ్ గుప్తా అంత్యక్రియలకు హాజరు కావాలని NGO ఆయన ముగ్గురు కుమార్తెలకు సమాచారం ఇచ్చింది. అయితే ఇప్పుడు తమకు అంత సమయం లేదని బదులిచ్చారు. కుమార్తెల్లో ఒకరు అంత్యక్రియల ఖర్చుల కోసం 5,500 రూపాయలు పంపి, అంత్యక్రియలన్నింటినీ వీడియో రికార్డింగ్ చేయమని కోరారు. ఆమె వీడియో కాల్‌లో తన తండ్రికి జరిగిన చివరి వీడ్కోలును చూసింది కానీ ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేదు. అంతేకాకుండా అంత్యక్రియలు ఎప్పుడు అయిపోతాయో చెప్తే భోజనం చేస్తామని చెప్పడం బాధకరం. ఇక అస్థికలు తీసుకుంటారా అంటే తరువాత చూద్దాం అని వారు సమాధానం ఇచ్చారు.

ఈ దృశ్యం అక్కడ ఉన్న ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. పిల్లలను కేవలం చదివిస్తే సరిపోదని, తల్లిదండ్రుల చివరి క్షణాల్లో వారికి అండగా నిలబడేలా విలువలను వారిలో పెంపొందించడం కూడా ముఖ్యమని అక్కడికి వచ్చినవారు అభిప్రాయపడ్డారు.

శివచరణ్ గుప్తా స్వస్థలం సోనిపత్‌లోని కక్రోయ్ గ్రామం. ముంబైలో సంవత్సరాల తరబడి కష్టపడి, ఆయన కోట్ల రూపాయల విలువైన వస్త్ర వ్యాపారాన్ని నిర్మించారు. అయితే, వ్యాపారంలో నష్టాలు రావడంతో, సుమారు మూడేళ్ల క్రితం తన భార్యతో కలిసి సోనిపత్‌కు తిరిగి వచ్చి ఒక వృద్ధాశ్రమంలో నివసించారు. ఏడాదిన్నర క్రితం ఆయన భార్య కన్నుమూశారు. ఆ తర్వాత, ఆయన ఒంటరితనం ఎంతగా పెరిగిపోయిందంటే ఇల్లు కూడా మార్చారు, చివరికి, ఆయన కూడా అదే ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తన కళ్లను దానం చేయడంతో ఆయన చివరి కోరిక నెరవేరింది.

Also Read : పుట్టుక, చావుల రిజిస్ట్రేషన్లపై మోదీ సర్కార్ కఠిన నిబంధనలు.. పార్లమెంట్‌లో బిల్లు పాస్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.