Trump Tariffs
Trump Tariffs

US Tariffs : డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి అధికారం చేపట్టాక భారతదేశంపై అనేక విషయాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నాడు. ఒకవైపు మిత్రదేశమంటూనే టారిఫ్‌లతో విరుచుకుపడుతున్నాడు. ఒకవైపు భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతుండగానే మరోసారి షాక్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ట్రంప్‌ మళ్లీ టారిఫ్‌లతో విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనెట్‌ తాజాగా ఆమోద ముద్ర వేసింది.

Also Read : అమెరికాలో ఉద్యోగ సంక్షోభం… 23,000 ఉద్యోగులు ఔట్‌

కాగా, ఇటీవల మృతిచెందిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ పేరు మీదుగా తీసుకొచ్చిన ఈ శాంక్షనింగ్‌ రష్యా, ఇరాన్‌ యాక్ట్‌ 2026ను అమెరికా సెనెట్‌ 86-11తో ఆమోదించడం గమనార్హం. ఈ బిల్లు ఆగస్టు 31న ప్రతినిధుల సభ ముందుకు వస్తుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌పై 100శాతం సుంకాల మోత మోగే ప్రమాదం ఉంది.

అయితే ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధానకారణం రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికే అని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచడమే అమెరికా లక్ష్యంగా ఉంది. గతంలో ట్రంప్‌ దీన్ని ఆర్థిక బంకర్‌ బస్టర్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. మాస్కో నుంచి చమురు దిగుమతులు చేసుకొనే దేశాలపై అమెరికా అధ్యక్షుడు అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభించనుంది. ఇది అమల్లోకి వస్తే భారత్, చైనా, స్లొవేకియా, హంగరీ, అజర్‌బైజాన్‌ వంటి దేశాలపై ప్రభావం పడనుంది. గతంలో ఈ టారిఫ్‌లు 500శాతం వరకు ఉండాలని ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ తర్వాత పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇతర కారణాలు, అంతర్జాతీయ పరిణామాలతో సుంకాల పరిమితిని సవరించి 100 శాతానికి తగ్గించడం గమనార్హం.

Also Read : మెటాకు భారీ షాక్.. రూ.5,500 కోట్ల ఫైన్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.