
You Tube : యూట్యూబ్‌లో వీడియోలు చేసి సంపాదించుకోవాలనుకునే కొత్త క్రియేటర్లకు ఇకపై మరింత కష్టంగా మారనుంది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) నిబంధనలను సంస్థ మార్చేసింది. ఇకపై ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలంటే గతంతో పోలిస్తే డబుల్ వాచ్-అవర్స్, అలాగే భారీగా షార్ట్స్ వ్యూస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం యూట్యూబ్‌లో వ్యూస్ విపరీతంగా పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. రోజూ యూట్యూబ్‌లో దాదాపు 200 బిలియన్ల షార్ట్స్ వ్యూస్ వస్తుండగా, టీవీల ద్వారా రోజుకు బిలియన్ గంటల వాచ్-టైమ్ వస్తోంది. 2018 తర్వాత ఈ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో వస్తున్న మొట్టమొదటి పెద్ద మార్పు ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌లో 3 మిలియన్ల మందికి పైగా క్రియేటర్లు ఉన్నారు.
Also Read : అబ్బాయిలకు చెప్పండి బుద్ధి.. అమ్మాయిల జీన్స్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు !
యూట్యూబ్ లేటెస్ట్‌గా ప్రకటించిన కొత్త అర్హతల ప్రకారం.. 2027 ఫిబ్రవరి 1 నుండి కొత్తగా వచ్చే క్రియేటర్లు యాడ్స్, యూట్యూబ్ ప్రీమియం ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఈ క్రింది రెండింటిలో ఏదో ఒకటి కచ్చితంగా సాధించాలి. 365 రోజుల్లో 8,000 వాచ్-అవర్స్ పూర్తి చేయాలి. ఇదివరకైతే కేవలం 4,000 గంటలు ఉండేది, ఇప్పుడు దానిని డబుల్ చేశారు.
లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ తెచ్చుకోవాలి. ఇది కూడా మునుపటి 10 మిలియన్ల నుంచి రెట్టింపు అయింది. అయితే, ఛానెల్‌కి 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలనే రూల్ మాత్రం మారలేదు, అది పాతదే ఉంటుంది. అలాగే, ఇప్పటికే వైపీపీలో ఉన్న పాత క్రియేటర్లపై ఈ కొత్త నిబంధనల ప్రభావం ఏ మాత్రం ఉండదు.
కొత్త, పాత క్రియేటర్లందరికీ వర్తించే మరో నిబంధన కూడా ఉంది. ఫిబ్రవరి 1 నుండి షార్ట్స్ ద్వారా యాడ్స్, సబ్‌స్క్రిప్షన్ రూపంలో డబ్బు రావాలంటే.. క్రియేటర్లు ప్రతి 90 రోజుల్లో 10 మిలియన్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ సాధించాలి. యూట్యూబ్ కొత్త రెవెన్యూ మోడల్ ప్రకారం.. ఆపరేటింగ్, ప్రమోషన్ ఖర్చులు అన్నీ పోను, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వచ్చే నికర ఆదాయంలో 30 శాతం, ప్రీమియం లైట్ ఆదాయంలో 60 శాతం ప్రత్యేక క్రియేటర్ల కోసం కేటాయిస్తారు.
మెంబర్ వాచ్-టైమ్, వ్యూస్ బట్టి ఈ డబ్బులను పంచుతారు. లాంగ్ వీడియోలకు 55 శాతం, షార్ట్స్‌కు 45 శాతం క్రియేటర్లకు అందుతాయి. ఈ మార్పుల వల్ల క్రియేటర్లకు మరింత ఎక్కువ ఆదాయం వస్తుందని యూట్యూబ్ చెబుతోంది. 2026తో పోలిస్తే 2027లో క్రియేటర్లకు మరింత ఎక్కువ చెల్లింపులు చేయగలమని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Also Read : కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ నిబంధనలు తెలుసా?









