America : భారత్‌పై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. తమ సుంకాలను తప్పించుకోవడానికి చైనాకు భారత్ సహాయం చేస్తోందని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించేందుకు చైనా ఉత్పత్తులపై విధించిన అధిక పన్నుల నుంచి తప్పించుకోవడానికి చైనా ఒక భారీ ‘షాడో నెట్‌వర్క్’ను ఉపయోగిస్తోందని అందులో భారత్ కూడా భాగస్వామిగా ఉందంటూ వ్యాఖ్యానించింది.

Also Read : నేను హఫీజ్‌కు బానిసని.. ఉగ్రవాదులతో పాక్ మాజీ మంత్రి

అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఈ ప్రత్యేక నివేదికను అధికారికంగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా చైనాకు సహకరిస్తున్న షాడో నెట్‌వర్క్‌లో భారత్‌తో సహా దాదాపు 40 దేశాలు ఉన్నాయని అగ్రరాజ్యం ఆరోపించింది.

వాణిజ్యపరంగా అక్రమ లేదా అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్నాయని భావించే దేశాలపై అమెరికా ‘సెక్షన్ 301’ నిబంధనల కింద భారీగా టారిఫ్‌లు, ఆంక్షలు విధిస్తుంటుంది. ఇందులో భాగంగానే 2018వ సంవత్సరంలో చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద కఠినమైన ఆంక్షలు అమలులోకి తెచ్చింది. అయితే నాటి నుంచి ప్రత్యక్షంగా కాకుండా ఇతర దేశాల ద్వారా చైనా సరుకులను అమెరికాకు అక్రమంగా రవాణా చేసే మార్గాలు పెరిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

చైనా ఉత్పత్తులను నేరుగా అమెరికాకు పంపకుండా భారత్ వంటి మూడో దేశానికి తరలించి.. అక్కడ వాటి తయారీ లేదా నామమాత్రపు ప్రాసెసింగ్ జరిగినట్లు చూపించి అమెరికా విధించిన భారీ పన్నుల నుంచి చైనా తప్పించుకుంటోందని ఆరోపించారు. ఇలా మూడో దేశాల ద్వారా జరిగిన అక్రమ సరకు రవాణా వ్యాపార విలువ దాదాపు 303 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అగ్రరాజ్యం అంచనా వేసింది. ఈ వ్యవహారంలో భారత్‌తో పాటు మరో 39 దేశాలు చైనాకు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరిస్తున్నాయని అమెరికా నివేదిక స్పష్టం చేయడంతో అంతర్జాతీయంగా వివాదం చెలరేగింది.

Also Read : ఎర్రకోట దాడి కేసులో వెలుగులోకి సంచలన నిజాలు.. అల్ ఖైదా కుట్ర అని తేల్చిన రిపోర్ట్!