
Terrorist : జైలులో ఉన్న లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పొగుడుతూ పాకిస్తాన్‌కు చెందిన మతబోధకుడు నసీర్ మద్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ కాశ్మీర్‌లోకి ఏకంగా 10 వేల మంది ఉగ్రవాదులను పంపాడని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆగస్టు 14న బహావుల్నగర్లో నిషేధిత లష్కరే తొయిబా అనుబంధ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మద్నీ మాట్లాడారు. ఇటీవల గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత మొదటిసారిగా పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హఫీజ్ సయీద్‌ను గొప్ప త్యాగధనుడిగా చిత్రీకరిస్తూ, ఆయన ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉండటంపై మద్నీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన జైలులో ఉన్నారు. కానీ ఆయన పాకిస్తాన్లో అత్యున్నత ఖైదీగా ఉండాల్సిన వ్యక్తి. తన మాతృభూమి అని చెప్పుకునే కాశ్మీర్ కోసం ఆయన 10,000 మంది ఉగ్రవాదులను త్యాగానికి పంపారు అని మద్నీ పేర్కొన్నారు.
అంతేకాకుండా, సయీద్ ఎలాంటి సాధారణ నేరాలకు పాల్పడలేదని కామెంట్ చేశారు. ఆయన ఎవరి షాపుల షట్టర్లు పగలగొట్టలేదు, చెట్లు నరకలేదు, ఆటోలు తోలలేదు. ఆయన దగ్గర ఎంతోమంది కమాండో యువకులు ఉన్నప్పటికీ, వారు దేశంలో ఒక్క పిట్టకు కూడా హాని చేయలేదు” అని సయీద్ ఉగ్రవాద చర్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాగా 2008 ముంబై దాడులతో సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడి సంఘటనల వెనుక లష్కరే తొయిబా, హఫీజ్ సయీద్ పాత్ర ఉందని స్పష్టమైన ఆధారాలు ఉన్న సంగతి తెలిసిందే.









