US Debt :  అమెరికా దేశం చేసిన అప్పులు ఊహించని స్థాయికి చేరిపోయాయి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా అక్కడ ప్రభుత్వం చేసిన అప్పు 40 ట్రిలియన్ డాలర్లకు (మన రూపాయిల్లో దాదాపు రూ. 3,300 లక్షల కోట్లు) చేరింది. ఒకవైపు అప్పు కొండలా పెరిగిపోతుంటే, మరోవైపు తెచ్చిన అప్పుకు కట్టాల్సిన వడ్డీ రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. బాండ్ల వడ్డీలు గత 20-25 ఏళ్లలో లేనంతగా పెరగడంతో అమెరికా ప్రభుత్వానికి వడ్డీలు కట్టడానికే సగం బడ్జెట్ ఖర్చయిపోతోంది.

ఈ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తమ దేశం ఇంత భారీగా వడ్డీలు కట్టడం ఏమాత్రం సరికాదని అన్నారు. అన్ని దేశాల కంటే అమెరికానే చాలా తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకోగలగాలని, వడ్డీ ఖర్చులు తగ్గితే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయని చెప్పారు. ఇదే సమయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ అధికారులపై విమర్శలు గుప్పించారు. అయితే, ఇటీవల తానే స్వయంగా నియమించిన ఫెడ్ బాస్ కేవిన్ వార్ష్ మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు.

Also Read : ట్రంప్ ఆర్థిక ఉగ్రవాది… శత్రుత్వాన్ని తప్ప ఏమీ సాధించలేరు.. ఇరాన్‌ చురకలు

అయితే ప్రభుత్వం అనుకున్నంత తేలికగా వడ్డీ రేట్లను తగ్గించలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వడ్డీ ఎంత ఉండాలనేది ప్రభుత్వం కాదు, మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లు నిర్ణయిస్తారు. అమెరికా ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు ఎక్కువ వడ్డీ ఇస్తేనే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. దీనివల్ల వడ్డీ భారం మరింత పెరుగుతోంది. ప్రస్తుతం ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, అమెరికా తన దేశ రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులను కేవలం పాత అప్పుల వడ్డీలు కట్టడానికే ఖర్చు చేస్తోంది.

ఈ భారీ అప్పు అమెరికాను ముంచేస్తుందా అంటే, నిపుణులు అవునని కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది, పైగా ప్రపంచ వ్యాపారాలన్నీ డాలర్‌తోనే జరుగుతాయి కాబట్టి ఆ దేశానికి మరిన్ని అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. కాకపోతే, తెచ్చే అప్పుతో కొత్త ప్రాజెక్టులు, సాంకేతికత, దేశ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే పరవాలేదు గానీ, కేవలం పాత అప్పుల వడ్డీలు కట్టడానికే కొత్తగా అప్పులు చేస్తూ పోతే మాత్రం మున్ముందు పెద్ద సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇక ప్రపంచంలోని మిగతా పెద్ద దేశాలతో పోలిస్తే.. చైనా అప్పు కూడా భారీగానే ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే, డాలర్లలో చూస్తే మన దేశం అప్పు అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. మన కేంద్ర ప్రభుత్వ అప్పులు దాదాపు రూ. 200.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది మన దేశ మొత్తం ఆదాయంలో దాదాపు 56 శాతానికి సమానం.

Also Read : మెలానియా ట్రంప్ మిస్సింగ్‌.. అమెరికా ఫస్ట్ లేడీ ఎక్కడ?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.