Cockroach Janata Party (CJP): ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై ఆందోళనకు పిలుపునివ్వడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కి సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీర్‌ అశుతోష్‌ రంకా ఆధ్వర్యంలో కొంతమంది కార్యకర్తలు శుక్రవారం రాజస్థాన్‌లో పర్యటించారు.  రాజస్థాన్‌లోని  జైపుర్‌ జిల్లా రాంపురా కన్వర్‌పురా గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు  సీజేపీ బృందం పై దాడికి పాల్పడ్డారు. వారిపై రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా కొట్టి గాయపరిచడమే కాకుండా కార్లను? ఫోన్లను ధ్వంసం చేశారు. కాగా వారిపై దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కొంతమంది గ్రామస్థుల విజ్ఞప్తి మేరకే  రాంపురా కన్వర్‌పురాకు అశుతోశ్ రాంకా తన బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. గ్రామం బయట వారి వాహనాలు నిలిపి కాలినడకన వారు గ్రామంలోకి ప్రవేశిస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న కొంతమంది వ్యక్తులు వారిని అడ్డుకోవడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా సీజేపీకి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సేజేపీ బృందాన్ని అర్బన్ నక్సల్స్, దేశద్రోహులు, పాకిస్థానీలంటూ వారు దూషిస్తూ దాడికి దిగారు. అయితే, సీజేపీ బృందంలోని కొంతమంది మహిళలు వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వెనుకకు తగ్గకపోగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆ గుంపు.. కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. గ్రామంలోకి ప్రవేశించకుండా వారి వెంటపడి మరీ తరిమికొట్టారు. రాళ్లు సైతం విసిరి తీవ్రంగా గాయపరిచారు.

ఈ ఘటనపై స్పందించిన అ సీజేపీ సహ వ్యవస్థాపకుడు అశుతోశ్ రాంకా మాట్లాడుతూ ఈ దాడికి బీజేపీయే కారణమని ఆరోపించారు. గోశాలలో పాఠశాలను నిర్వహిస్తున్నారని, తమ గ్రామానికి వచ్చి చూడాలని తమను స్థానికుల ఆహ్వానించారని, ఆ మేరకే తాము వచ్చామని రాంకా వివరించారు. ‘చాలా సంవత్సరాలుగా పాఠశాల ఓ గోశాలలో నడుస్తోంది. గతేడాదీ కూడా మేము ఇదే పాఠశాలను సందర్శించాం. ఈ రోజు పర్యటన గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం. కానీ బీజేపీ గూండాలు అప్పటికే అక్కడ వేచి ఉన్నారు. మా వాలంటీర్లపై దాడి చేశారు. మా కార్లు, ఫోన్లను ధ్వంసం చేశారు. ఓ మహిళపైనా కూడా దాడి చేశారు. నా చొక్కాను చింపేశారు. మా బృంద సభ్యుల్లో ఒకరి చేయి విరిగింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే.. రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారని, వాహనాలపై ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడకు రాలేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. తమ బృందంపై దాడి బీజేపీ పనేనని మండిపడ్డారు. ఈ ఘటనలో తమ వాళ్లు గాయపడ్డారని తెలిపారు. రాజస్థాన్‌లో గూండాల పాలన నడుస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా, సీజేపీ బృందంపై జరిగిన దాడి రాజస్థాన్ అసెంబ్లీలోనూ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటసారా ఈ దాడికి బీజేపీయే కారణమని ఆరోపించారు.. రాజస్థాన్ హోంమంత్రి జవహర్ సింగ్ బేదం మాత్రం సీజేపీ ముసుగులో కాంగ్రెస్ పార్టీయే గొడవ సృష్టిస్తోందని అన్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.