Sanjay Gupta : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా లక్సార్ ప్రాంతంలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా సంచలన కామెంట్స్ చేశారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన హయాంలో లక్సార్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సంజయ్ గుప్తా గుర్తు చేసుకున్నారు. గతంలో ఇక్కడ ప్రజలు ఇరవై అడుగుల లోతులో ఉన్న కలుషిత భూగర్భ జలాలను తాగే వారని, కానీ తాను ముఖ్యమైన తాగునీటి ప్రాజెక్టులను తీసుకువచ్చి అందరికీ మంచి నీటిని అందించానని ఆయన చెప్పారు.

అయితే, ప్రసంగం సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నేను ప్రజలకు మంచి నీళ్లు ఇచ్చాను, కానీ మీరు ఆ నీళ్లు తాగి నాకు ఓటు వేయకపోతే మీ కడుపులో పురుగులు పడతాయి, మీ కడుపు పగిలిపోతుంది అంటూ ఆయన ఓటర్లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.

ఈ ప్రసంగం అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలను, స్థానికులను విస్మయానికి గురిచేయగా, కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రాజకీయ వర్గాలలో తీవ్రమైన విమర్శలు, చర్చలు మొదలయ్యాయి. రాబోయే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.

సంజయ్ గుప్తా తన హయాంలో మహటోలీ సహా పలు గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ మరియు తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎంతగానో కృషి చేశానని తెలిపారు. 2012 నుంచి 2022 వరకు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తాను చేసిన అభివృద్ధి పనులను ఈ వేడుకలో ఆయన ప్రస్తావించారు.

ఈ వేడుకకు ఉత్తరాఖండ్ మాజీ కేబినెట్ మంత్రి స్వామి యతీశ్వరనంద్, అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురితో పాటు పలువురు మత గురువులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంజయ్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, సంజయ్ గుప్తా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో లక్సార్ స్థానం నుంచి విజయం సాధించి, ఆ తర్వాత 2017 ఎన్నికల్లోనూ అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కానీ, 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఎస్పీ అభ్యర్థి మొహమ్మద్ షాజాద్ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.