
Telangana : నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి తాజాగా ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (A1) ఉన్న యువకుడి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యతో తమ కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. తమ కొడుకుకు కనీసం మద్యం తాగే అలవాటు కూడా లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రూపారెడ్డి మృతదేహాన్ని చూసిన తర్వాత తమ కొడుకు తీవ్ర భయాందోళనకు గురై, ఐదు రోజుల పాటు స్కూలుకు కూడా వెళ్లలేదని వారు తెలిపారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తిని సరిగ్గా గుర్తించలేకపోయారని, కేవలం అనుమానంతోనే తన కొడుకును నిందితుడిగా చేరుస్తున్నారని పేరెంట్స్ ఆరోపించారు. అంతేకాకుండా, పోలీసులు తమ కొడుకును తీవ్రంగా టార్చర్ పెడుతున్నారని వారు వాపోయారు. అసలు మా కొడుకే ఈ హత్య చేసి ఉంటే మేం కూడా బతికి ఉండమని, మేం కూడా చనిపోతామని కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. రూపారెడ్డి స్కూల్‌లోనే చదువుతున్న ముగ్గురు మైనర్ విద్యార్థులు గంజాయి వ్యసనానికి బానిసలయ్యారు. ఇటీవల స్కూల్ ప్రాంగణం సమీపంలో వారు గంజాయి సేవిస్తుండగా ప్రిన్సిపల్ రూపారెడ్డి చూసి తీవ్రంగా మందలించారు. అంతేకాకుండా, వారు గంజాయి తాగుతున్న దృశ్యాలను ఆమె తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో ఎక్కడ బయటపెడుతుందో, తమ భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోననే కోపంతో, భయంతో ఆ విద్యార్థులు ఆమెపై కక్ష పెంచుకున్నారు.
రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు పక్కా రెక్కీ నిర్వహించారు. పోలీసులకు ఎక్కడా తమ వేలిముద్రలు, ఆధారాలు దొరక్కూడదని హ్యాండ్ గ్లౌవ్స్, మాస్కులు ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే అత్యంత దారుణంగా ఆమె శరీరంపై ఏకంగా 27 సార్లు చాకుతో పొడిచి ప్రాణాలు తీశారు. హత్య చేసిన అనంతరం, ఆ గంజాయి వీడియో ఉన్న ఐఫోన్‌తో పాటు ఇంట్లోని రూ. 4 లక్షల నగదును తీసుకుని అక్కడ నుంచి పరారైనట్లు సమాచారం.









