Delhi : కారును కాజేయాలన్న దురాశతో ఓ క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆఫ్‌లైన్ బుకింగ్ పేరుతో నమ్మించి మోసంచేసి, చివరకు ప్రాణాలు తీసిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఆశిష్ పాల్ టాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది జూలై 20వ తేదీన అతనికి సరితా విహార్ నుంచి జైపూర్‌కు వెళ్లేందుకు ఒక ఆఫ్‌లైన్ ట్రిప్ బుకింగ్ వచ్చింది. ఎవరికీ చెప్పకుండా కుదుర్చుకున్న ఆ ప్రయాణమే అతని ప్రాణాలను బలి తీసుకుంది. ప్రయాణం మధ్యలో అద్దె, ఛార్జీల విషయమై డ్రైవర్ ఆశిష్‌కు, ప్రయాణికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో మరింత రెచ్చిపోయిన నిందితులు క్షణికావేశంలో అతనిపై దాడి చేసి, గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశారు.

అంతటితో ఆగకుండా మృతదేహాన్ని కారులోనే ఉంచుకుని రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మోఖంపూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో శవాన్ని పడేసి ఎవరికీ దొరక్కుండా పారిపోయారు. బాధితుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొదట రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ మోఖంపూర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత కేసును ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని రంగంలోకి దిగారు. ట్యాక్సీ బుకింగ్ పాయింట్లు, హైవేలు, టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. టెక్నికల్ సర్వైలెన్స్ సహాయంతో కారు కదులుతున్న దారిని గుర్తించి నిందితుల జాడను పట్టుకున్నారు. రాజస్థాన్ పోలీసుల సహకారంతో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నలుగురు నిందితులతో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితులు చెప్పిన నిజాలు విస్మయానికి గురిచేశాయి. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వీరు, ఒక ఖరీదైన కారును దోచుకోవాలనే పక్కా ప్లాన్‌తోనే ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. హత్య చేసిన తర్వాత ఆశిష్ మొబైల్ ఫోన్, డబ్బులు వాడుకోవడమే కాకుండా, అతని ఏటీఎం కార్డుతో నగదు డ్రా చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎవరికీ అనుమానం రాకుండా కారు నెంబర్ ప్లేట్ మార్చి అజ్మీర్‌లో తలదాచుకున్నారు. నాగౌర్‌కు వెళ్లి తమ పరిచయస్తులకు ఈ విషయం చెప్పి వేరే ప్రాంతానికి పారిపోయేందుకు యత్నించగా, జైపూర్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుల నుంచి అపహరించిన కారును, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.