Rains
Rains

వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న వారం రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. జూలై 1, 2 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన జల్లులు పడతాయి. జూలై 3 తర్వాత వర్షాలు కొద్దిగా తగ్గినప్పటికీ మళ్లీ జూలై 6, 7 తేదీల్లో కోస్తాంధ్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నాయి. జూలై 1, 2 తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. వీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వానలు పడవచ్చు. జూలై 3, 4 తేదీల్లో జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సిద్ధిపేట జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.