Ketan Vishal Agarwal : మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్న బిజినెస్‌మ్యాన్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. మొదట ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన ఈ ఘటన, పోలీసుల విచారణలో పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. తన కాబోయే భార్యే ఈ దారుణానికి ఒడిగట్టిందని నిర్ధారించిన పోలీసులు, ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్టు చేశారు. 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు గల లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా గాలికి
పట్టుతప్పి లోయలో పడిపోయాడని అతని కాబోయే భార్య సియా గోయల్ పోలీసులకు తెలిపింది.
అయితే విచారణ సమయంలో సియా ఇచ్చిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే కేసును వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత బంధాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లోతైన దర్యాప్తులో సియాకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని, ఆ వ్యక్తి మరెవరో కాదు ఆమెతో కలిసి ఒకే ఆఫీసులో పనిచేసే చేతన్ చౌదరీ అని వెల్లడైంది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం సియాకు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో, అతడిని అడ్డు తొలగించుకునేందుకు తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది.
పక్కా ప్లాన్ ప్రకారం, సియా తన పుట్టినరోజు వేడుకల కోసం కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లింది. అక్కడ సరైన అవకాశం కోసం వేచి చూసిన సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరీ, ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలోకి తోసేశారు. ప్రమాదం జరిగిన తర్వాత అది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది సియా. కానీ, మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్ , స్థానికుల విచారణతో ఆమె చేసిన నేరం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు, ఈ హత్యలో మరెవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు కేతన్ అగర్వాల్ పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు. అతను తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఫిబ్రవరిలో కేతన్, సియాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.ఈ ఏడాది నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగాల్సి ఉంది. కేతన్ కుటుంబం ఈ వివాహం కోసం రూ. 17 కోట్లు కేవలం ప్యాలెస్ బుకింగ్‌కే ఖర్చు చేసింది, అంతేకాకుండా అతిథులను తరలించేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే, సియా చేసిన ఈ అమానుష చర్య రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.