
S ai Krishna Missing Case: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం, మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT) లోతుగా పరిశోధన జరుపుతోంది. తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆవరణలో వెలుగుచూసిన కొన్ని ఆధారాలు ఈ కేసును సరికొత్త మలుపు తిప్పాయి.కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనంపై ఉన్న టెర్రస్‌ను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ అనుమానాస్పద మరకలున్న ఒక లాఠీ, ఎముకలు, కాలిన బూడిదతో పాటు సగం కాలిన ఒక స్టీల్ బ్రేస్లెట్ (మణికట్టు గొలుసు), మరికొన్ని వస్తువులు లభించాయి. సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇవి ఉండటం గమనార్హం.
టెర్రస్‌పై లభ్యమైన ఈ వస్తువులను సిట్ అధికారులు తక్షణమే స్వాధీనం చేసుకున్నారు. న్యాయాధికారి సమక్షంలో వీటన్నింటికీ సీల్ వేసి, తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కి పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయికృష్ణకు చెందినవేనని సిట్ అధికారులు బలంగా భావిస్తున్నారు. ఈ అంశాలను కోర్టుకు సమర్పించిన కస్టడీ పిటిషన్లోనూ ప్రస్తావించారు.క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని అణువణువూ గాలించారు. లాకప్ గదులతో పాటు స్టేషన్‌లోని గోడలపై ఉన్న అనుమానాస్పద మరకల నమూనాలను సేకరించారు. ఒకవేళ సాయికృష్ణ శవాన్ని బయటకు తీసుకెళ్లి దహనం చేసి ఉంటే, మళ్లీ ఆ ఎముకలను, బూడిదను పోలీస్ స్టేషన్ టెర్రస్‌పైకి ఎందుకు తెచ్చారు? లాఠీపై ఉన్న మరకలు ఎవరివి? అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.
డీఎన్ఏ పరీక్షే కీలకం
స్టేషన్ టెర్రస్‌పై దొరికిన ఎముకలు, బూడిద సాయికృష్ణవేనా కాదా అని శాస్త్రీయంగా నిరూపించేందుకు సిట్ అధికారులు డీఎన్ఏ పరీక్షకు సిద్ధమవుతున్నారు. దీనికోసం న్యాయస్థానం అనుమతితో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డీఎన్ఏ నమూనాలను సేకరించి, లభ్యమైన ఎముకల నమూనాలతో పోల్చి చూడనున్నారు. ఈ పరీక్షల ఫలితాలు వస్తేనే సాయికృష్ణ మరణం వెనుక ఉన్న అసలు గుట్టు వీడనుంది.
తన కుమారుడు సాయికృష్ణను పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే దారుణంగా హత్య చేశారని ఆయన తల్లి విజయలక్ష్మి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కనీసం తన కుమారుడి బూడిదనైనా ఇస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటానని ఆమె కోర్టును వేడుకున్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ ఆవరణలో రక్తపు మరకలు, ఎముకలు లభించడంతో సాయికృష్ణను స్టేషన్ లోపలే హతమార్చి, సాక్ష్యాలు దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సాయికృష్ణ పోలీసు కస్టడీలో ఉన్న విషయాన్ని నిందితుడైన అప్పటి సీఐ నాగరాజు అత్యంత గోప్యంగా ఉంచినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. మే 1 నుండి జూన్ 1 మధ్య కాలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ సీసీటీవీ (CCTV) ఫుటేజీని ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. సాక్ష్యాధారాలను తుడిచేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగినట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజు ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ కోర్టు ఆయనను ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు సిట్ కస్టడీకి అనుమతిస్తూ కొన్ని కఠిన షరతులు విధించింది. నాగరాజును రాజమండ్రి జైలులోనే విచారించాలని, నిందితుడు ఎంచుకున్న న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని, అలాగే విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది.విజయవాడ కోర్టు విధించిన షరతులు దర్యాప్తుకు ఆటంకంగా మారాయని సిట్ అదనపు ఎస్పీ హైకోర్టును ఆశ్రయించారు. నేరం కృష్ణలంక పీఎస్ పరిధిలో జరిగినందున, నిందితుడిని జైలు దాటించకుండా విచారిస్తే ఆయన వాంగ్మూలం ఆధారంగా ఇతర సాక్ష్యాలను రాబట్టడం సాధ్యం కాదని సిట్ తరఫు పీపీ వాదించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేసింది.
మరోవైపు తనపై పెద్ద కుట్ర జరిగిందని, ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సీఐ నాగరాజు కోర్టుకు లేఖ రాశారు. సిట్ అధికారులు తనను భయభ్రాంతులకు గురిచేసి నేరాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనను చిత్రహింసలకు గురిచేయకుండా చూడాలని జైలు అధికారుల ద్వారా కోర్టుకు వినతి పంపారు. హైకోర్టులో సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పష్టత వస్తేనే నాగరాజు పూర్తిస్థాయి విచారణ ముందుకు సాగనుంది.









