duvvada

Duvvada Srinivas :  ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యమవటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన, మంగళవారం ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు బయల్దేరారు. టెక్కలి నుంచి స్టార్ట్ అయిన దువ్వాడ శ్రీనివాస్ గమ్యస్థానానికి చేరలేదు. ప్రయాణంలో ఉండగానే తన వెంట ఉన్న గన్‌మన్‌ను మార్గమధ్యంలోనే దించేశారు. అనంతరం ఆయన అదృశ్యమయ్యారు. దువ్వాడ శ్రీనివాస్, ఆయన డ్రైవర్ మొబైల్ ఫోన్లు రెండూ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొన్నది. దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యంపై దివ్వెల మాధురి తీవ్రంగా స్పందించారు.

దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద అనుచరులు, అభిమానులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. దీంతో దువ్వాడ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా దివ్వెల మాధురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ… పోలీసులు దువ్వాడను మార్గమధ్యంలోనే అక్రమంగా అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. వెంటనే దువ్వాడను తమకు చూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవన్నట్టు దువ్వాడను ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని అన్నారు. వెంటనే దువ్వాడ శ్రీనివాస్‌ను తమకు చూపించాలని పోలీసులను మాధురి డిమాండ్ చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్‌ను తాము అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన గల్లంతు వ్యవహారంతో పోలీసులకు ఎలాంటి అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం ఆయన స్టేషన్‌కు బయలుదేరారు. అయితే, పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ముందే పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే సమాచారం దువ్వాడకు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఒక వ్యూహం ప్రకారం చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తన పాస్‌పోర్టును గన్‌మన్‌ చేతికి ఇచ్చి ఎస్పీ ఆఫీసులో అప్పగించాల్సిందిగా పంపినట్లు సమాచారం. అనంతరం గన్‌మన్‌ను మార్గమధ్యంలోనే దించేసి దువ్వాడ అదృశ్యమయ్యారని ప్రచారం జరుగుతున్నది. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఆయన పరారీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంతో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో దువ్వాడ అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.