
Rayagada : ఒడిశాలోని రాయగడ జిల్లాలో మానవత్వం మంటగలిసిపోయే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పుకార్లను నమ్మి, దారి తప్పి వచ్చిన ఇద్దరు ఎన్జీవో కార్యకర్తలపై గ్రామస్థులు కిడ్నాపర్లనే నెపంతో అమానుషంగా దాడి చేశారు. ఈ దాడిలో యువతి బట్టలు చింపేసి, వివస్త్రను చేసి అత్యంత అనాగరికంగా ప్రవర్తించారు. జూన్ 16న కల్యాణ్ సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుల్‌గూడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
🚨Merciless Odisha: Mob Attacks NGO Workers Over Child Kidnapping Rumors in Rayagada
On June 16, NGO fellows Suman Jha from Delhi and Arpita Sutaria from Gujarat faced a violent mob in Rayagada’s Intaliguda village while asking directions during a field visit.
Villagers,… pic.twitter.com/qdFNNrMxhU
— Ramesh Tiwari (@rameshofficial0) June 20, 2026
కంధమాల్ జిల్లాలో ఒక ప్రముఖ ఎన్జీవోలో పని చేస్తున్న యువతీయువకులు జూన్ 16న ఒక సామాజిక కార్యక్రమం కోసం కలహండిలోని తువాముల్ రాంపూర్‌కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వారికి ఆ ప్రాంతం కొత్త కావడంతో దారి కోసం ‘గూగుల్ మ్యాప్’ సహాయం తీసుకున్నారు. అయితే, మ్యాప్ తప్పుగా చూపించడంతో వారు పొరపాటున దారి తప్పి రాయగడ జిల్లాలోని కందుల్‌గూడ గ్రామానికి చేరుకున్నారు.
దారి తప్పామని గ్రహించిన కార్యకర్తలు గ్రామస్థులను దారి అడగాలని నిర్ణయించుకున్నారు. వాహనాన్ని ఆపి సమాచారం సేకరిస్తున్న క్రమంలో, అక్కడే ఉన్న పిల్లలతో వారు సరదాగా మాట్లాడి ఆప్యాయంగా బిస్కెట్లు ఇచ్చారు. వారి మంచి మనస్సుతో చేసిన ఈ చిన్న పనే వారికి ప్రాణసంకటంగా మారింది. “గ్రామంలోకి కిడ్నాపర్లు వచ్చారు, పిల్లలకు బిస్కెట్లు ఇచ్చి ఆకర్షిస్తున్నారు” అనే పుకారు క్షణాల్లో గ్రామం మొత్తం పాకింది.
ఈ పుకారు విన్న గ్రామస్థులు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. ద్విచక్రవాహనం తాళాన్ని లాక్కొని, వారి ఐడీ కార్డులను చూపించాలని డిమాండ్ చేశారు. వారు ఐడీ కార్డులు చూపించి, తాము ఎన్జీవో కార్యకర్తలమని, దారి తప్పి వచ్చామని ఎంత వివరించినా గ్రామస్థులు వినలేదు. కొంతమంది కర్రలతో, మరికొందరు చేతులు, కాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా కొట్టడమే కాకుండా, యువతిని వివస్త్రను చేసి అనాగరికంగా ప్రవర్తించారు. ఈ దారుణాన్ని కొంతమంది గ్రామస్థులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.
మరికొంతమంది గ్రామస్థులు గమనించి బాధితులను రక్షించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని రాయగడ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేసినట్లు రాయగడ ఎస్పీ రాజ్ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన 21 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతోందని, ఇందులో మరికొంతమంది ప్రమేయం ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.









