Rains
Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేశారు. ఈ తుఫాను వాతావరణం కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

దీంతో సముద్రం తీవ్రంగా అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గడిచిన రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఆత్మకూరు మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా, కోడుమూరు పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం నమోదైంది. నంద్యాల, మహానంది, బండిఆత్మకూరు, పాణ్యం మండలాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. రేపటి నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.