Bihar :  బీహార్‌లోని లఖీసరాయ్‌లో ఉన్న ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయంలో ఏర్పడిన తొక్కిసలాట లాంటి పరిస్థితి వల్ల ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రావణ సోమవారం కావడంతో పరమశివుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు.

Also Read : సెలవుపై ఇంటికొచ్చి.. పంజాబ్‌లో ఆర్మీ జవాన్ దారుణం!

ఉదయం వేళ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న ఒక విద్యుత్ స్తంభం కింద పడిపోవడం వల్ల కొందరికి కరెంట్ షాక్ తగిలిందని, దాంతో భయంతో జనాలు పరుగులు తీయడంతో ఈ తొక్కిసలాట జరిగిందని సమాచారం ఉంద ని ఎస్డీపీఓ శివమ్ కుమార్ తెలిపారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన తర్వాతే అసలు కారణం స్పష్టంగా చెప్పగలమన్నారు.

ఈ ఘటనపై లఖీసరాయ్ జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 6:30 నుంచి 6:45 గంటల మధ్య సమయంలో వరుసగా రెండు రైళ్లు రావడం వల్ల ఒక్కసారిగా ఊహించని స్థాయిలో జనం పెరిగిపోయారని వివరించారు. భక్తుల రద్దీకి సంబంధించిన ఏర్పాట్లు ముందే చేసినప్పటికీ, జనం తాకిడి ఎక్కువ కావడంతో ఒకవైపు ఉన్న బారికేడ్లు విరిగిపోయి ఈ విచారకరమైన ఘటన జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తొక్కిసలాట ఘటనపై సీఎం సమ్రాట్ చౌదరి విచారం వ్యక్తం చేశారు. లఖిసరాయ్‌లోని అశోక్‌ధామ్‌లో జరిగిన సంఘటన అత్యంత విచారకరమైనది. ఈ ప్రమాదంలో భక్తులు మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.  గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Also Read : భార్యను హత్య చేసి.. తల్లికి మెసేజ్ పెట్టి ఇంజనీర్ సూసైడ్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.