Sexual Assault : హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ శివారులో ఒక మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగికదాడికి యత్నించడం కలకలం రేపింది. గత ఏడేండ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన జరిగిన స్థలంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒక క్యాబ్ డ్రైవర్ మహిళపై లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేసి చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. జరిగిన సంఘటనపై ఆ మహిళా చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతలోని శివాజీనగర్‌కు చెందిన ఓ మహిళ సెప్టెంబర్ 26న సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి హైదరాబాద్‌కు క్యాబ్‌లో బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న కారు తుండుపల్లి టోల్‌ గేట్‌ సమీపానికి చేరుకోగానే డ్రైవర్‌ అకస్మాత్తుగా వాహనం దారి మళ్లించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ సందర్భంగా కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి డ్రైవర్‌ క్యాబ్‌ను తీసుకెళ్లాడు. కారును అక్కడ నిలిపిన డ్రైవర్‌ సదరు మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతనితో పెనుగులాడిన మహిళ అతడ్ని ప్రతిఘటించి, క్యాబ్‌ నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు వేయడంతో భయపడిన డ్రైవర్‌ అక్కడి నుంచి కారుతో సహ వేగంగా పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మహిళకు సంబంధించిన బ్యాగ్‌ కారులోనే ఉండిపోయింది. అందులో రూ.60 వేల నగదు ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది.

Also Read : నగలు, నగదుతో వీడియో…. ఉన్నదంతా ఊడ్చుకెళ్లిన దొంగలు

అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ జరిగిన ఘటనపై శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, కారు నెంబర్‌ తెలియకపోవడంతో డ్రైవర్‌ను చూస్తే గుర్తుపట్టగలనని ఆ మహిళ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తుండుపల్లి టోల్‌ప్లాజా పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాక క్యాబ్‌ ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. నిందితుడిని వీలయినంత తొందరగా గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వివరించారు. కాగా. తన బ్యాగ్‌, అందులోని నగదును తిరిగి ఇప్పించాలని బాధితురాలు పోలీసులను వేడుకొంది.

కాగా, తుండుపల్లి ప్లాజా పరిసర ప్రాంతంలో 2019లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఏడాది నవంబర్‌ 27న శంషాబాద్‌కు చెందిన వెటర్నరీ వైద్యురాలు తన ద్విచక్ర వాహనాన్ని తుండుపల్లి వద్ద నిలిపి అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లిన అనంతరం తిరిగి అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో మద్యం సేవించి ఉన్న నలుగురు వ్యక్తులు ఆమె వాహనం టైర్‌లో గాలి తీసి, సాయం చేస్తామనే నెపంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను హత్య చేసి ఆ మృతదేహాన్ని లారీలో తరలించి చటాన్‌పల్లి సమీపంలోని వంతెన కింద దహనం చేసిన చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. మరునాడు ఉదయం అంటే నవంబర్‌ 28న మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. అనంతరం ఘటనకు బాధ్యలైన నలుగురిని పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేశారు. తాజాగా అదే ప్రాంతానికి సమీపంలో తాజాగా మరో మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read : ఇబ్రహీంపట్నం మహిళ హత్య మిస్టరీ వీడింది.. ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.