Colombia : కొలంబియాలోని అక్రమ బంగారు గనిలో సంభవించిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కొలంబియాలోని నరిన్యో ప్రావిన్స్ పరిధిలోని పోలికార్ప గ్రామానికి సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Also Read : ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం: ఆసుపత్రికి తరలింపు!

బంగారం వెలికితీసే ఈ బహిరంగ గనిలో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, ఆ మరుక్షణమే కింద పనిచేస్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడి లోపల చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే గనిలో చేపడుతున్న తవ్వకాల పనుల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానిక అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న సహాయక బృందాలు జెసిబి యంత్రాల సహాయంతో మృతదేహాలను బయటకు తీశాయి.

కొలంబియాలో ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతులు, ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేని అక్రమ గనుల్లో స్థానికులు విలువైన లోహాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. ఈ ప్రమాదంలో మరణించిన 13 మందిలో నలుగురు ఒకే గిరిజన కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.

ఈ ప్రాంతంలో దాదాపు 50 మంది వరకు క్రమం తప్పకుండా పనులు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. వీరిలో ఎక్కువమంది క్విల్లాసింగా అనే స్థానిక గిరిజన తెగకు చెందినవారే ఉన్నారు. కొలంబియాలో సుమారు 2 లక్షల నుండి 4 లక్షల మంది ప్రజలు ఇలాంటి చిన్నపాటి గనుల తవ్వకాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దొరికిన బంగారం, విలువైన రాళ్లను అమ్ముకుని వచ్చే ఆదాయంతోనే అనేక కుటుంబాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి.

Also Read : పాకిస్తాన్ 750 కి.మీ ఆకాశహర్మ్యం మూసివేత..? ఆ మిస్సైళ్లను పరీక్షించేందుకేనా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.