She Teams : ఈ నెల 14 నుంచి 26 వరకు హైదరాబాద్‌ వ్యాప్తంగా గణేష్‌ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఉత్సవాలలో నగరమంతా భక్తి పారవశ్యంతో మునిగితేలింది. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలను నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆడవారిని వేధించారు. అలా వేధించిన వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అలాంటి వారిలో 2,935 మంది ఆకతాయిలను గుర్తించి నిందితులకు శిక్షలు పడేలా చేసినట్లు అధికారులు తెలిపారు.

నగరంలో జరిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతులకు ఎలాంటి వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌లు. ఇతర ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భక్తులు పెద్ద ఎత్తున హజరయ్యే ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ మండపాల వద్ద షీ టీమ్స్‌ను పెద్ద ఎత్తున మోహరించారు. తద్వారా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.అలా సెప్టెంబర్ 14 నుంచి 26 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, నిఘాలో 2,935 మంది ఆకతాయిలు షీ టీమ్స్ కు పట్టుబడ్డారు. వీరిలో పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలేయ్యగా.. మరికొందరిపై కేసులు నమోదు చేసి, శిక్షలు పడేలా చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఉత్సవాల సందర్భంగా మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన 858 మందికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారికి సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చి విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించిన వారిలో 69 మందిని అదుపులోకి తీసుకుని శిక్ష విధించినట్లు వెల్లడించారు. వారిలో 24 మందికి రూ.1,050 జరిమానా విధించగా.. మరో 40 మందికి సామాజిక సేవతో పాటు రూ.1,050 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు ప్రవర్తన మరింత అసభ్యంగా ఉండటంతో వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. పండుగల సమయంలో యువత భక్తిశ్రద్ధలతో ఉండాలని, అంతేకానీ మహిళలను వేధించడం సరికాదని పోలీసులు స్పష్టం చేశారు. ఆకతాయి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.