Crime News : యూకేలో ఎంబీఏ చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మల్‌ జిల్లా బాసరలో చోటు చేసుకున్న ఈ విషాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్‌ గ్రామానికి చెందిన రమావత్‌ సాయికిరణ్‌ (25) యూకేలో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ మధ్యనే అతను స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉన్న సాయికిరణ్‌ మంగళవారం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బాసర సరస్వతి ఆలయానికి దర్శనానికి వెళ్లాడు.

దర్శనం అనంతరం గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిపై ఫోటోలు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు గోదావరినదిలో పడిపోయాడు. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు సాయికిరణ్‌ కోసం తీవ్రంగా గాలించారు. రాత్రి కావడంతో అతని ఆచూకీ లభించలేదు. కాగా తిరిగి బుధవారం గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతూ తమ కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన కొడుకు కండ్లముందే గోదావరిలో పడి చనిపోవడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది. తండ్రి రమావత్‌ భోజారామ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.