Uber layoffs : అమెరికాకు చెందిన పలు కంపెనీలు తమ సంస్థలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇప్పటికే ఆయా కంపెనీలు గత ఏడాది మొత్తంగా 1,22,606 మంది సిబ్బందిని కంపెనీలు తగ్గించుకున్నాయి. ప్రముఖ టెక్‌ కంపెనీలైన అమెజాన్‌, డెల్‌ , మెటా , మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ఇందులో ముందు వరుసలో ఉన్నాయి. కృత్రిమ మేధతో పాటు ఇతర కారణాలతో ఈ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉధ్వాసన పలికాయి. తాజాగా అమెరికాకే చెందిన ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ సైతం అదే బాటలో చేరింది. ఆ సంస్థ కూడా లేఆఫ్‌లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తగా 3,300 మందిని తప్పిస్తున్నట్లు ఉబర్‌ ప్రకటించింది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 10శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు స్పష్టం చేసింది. మేనేజ్‌మెంట్‌లో లేయర్లు తొలగించడంతో పాటు రైడ్‌ షేరింగ్‌, డెలివరీ, రోబోట్యాక్సీ వ్యాపారాలపై పెట్టుబడులను సమీక్షించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబర్‌ పేర్కొంది. ఈ మేరకు కంపెనీ సీఈవో దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు ఇ-మెయిల్‌ పంపినట్లు వెల్లడించింది. స్థానిక నిబంధనలు అనుసరించాల్సిన దేశాలు మినహా లేఆఫ్‌ల సమాచారం ఆయా ఉద్యోగులకు చేరవేసినట్లు వివరించింది.

కాగా, ఇటీవలి కాలంలో ఉబర్‌ అభివృద్ధి పథంలో పయనించే క్రమంలో సమన్వయం కోసం మరిన్ని అంచెలు ఏర్పాడ్డాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అవి ఉపయోగపడడం లేదని ఉబర్‌ సీఈవో తన లేఖలో వివరించారు. ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో 20 శాతం మేర మేనేజర్లను తగ్గించకోవాలనుకుంటున్నట్లు ఉబర్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. వారిలో కొందరిని వ్యక్తిగత రోల్స్‌కు పరిమితం చేయనున్నామని తెలిపారు. అయితే, వారిలో ఎంతమందిని లేఆఫ్ చేసేదీ మాత్రం ఉబర్‌ ఇప్పటివరకు వెల్లడించలేదు. మేనేజర్‌ బాధ్యతల్లో లేనివారిపైనా కూడ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది..

ఉబర్‌ రిమోట్ వర్క్ విధానాన్ని దాదాపు ముగించించినట్లేనని తెలిపింది. భవిష్యత్తులో కేవలం 1% మందికి మాత్రమే రిమోట్ పని అనుమతి ఉంటుందని తెలిపింది, మిగిలిన ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిందేనని ఉబర్‌ తేల్చి చెప్పింది. సీఈవో స్థాయి నుంచి 7 కంటే ఎక్కువ లేయర్ల దిగువన ఉన్న ఉద్యోగుల సంఖ్యను 20 శాతం, ఒకరిద్దరు మాత్రమే ఉండే మైక్రోటీమ్‌ల సంఖ్యను దాదాపు 50 శాతం తగ్గిస్తున్నట్లు ఉబర్‌ సీఈవో స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఉబర్‌ ఉద్యోగుల సంఖ్య 30 వేలకు మాత్రమే పరిమితం కానుంది. 2021లోనూ దాదాపు ఇదే సంఖ్య ఉండగా. తిరిగి అదే సంఖ్యకు ఉబర్‌ చేరుకుంది. కాగా లేఆఫ్‌ల కారణంగా ఏఐ ప్రస్తావన రానప్పటికీ.. కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచాలన్న లక్ష్యంతోనే ఉబర్‌ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.