Komatireddy Rajagopal Reddy :కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు నల్లగొండ జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వర్థంతి సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..తెలంగాణ లో రాజశేఖర్ రెడ్డి కి అభిమానులు లక్షలాది మంది ఉన్నారన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చి కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని, అధికారాన్ని చెలాయించాలని కొంతమంది చూస్తున్నారని ఆరోపించిన ఆయన, రాజగోపాల్ రెడ్డి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ కబ్జా చేయలేరని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పక్క పార్టీ నుంచి మా ఇంటి పార్టీకి వచ్చి… మమ్మల్నే బయటికి పంపుతామంటే బాగోదు అని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పుకున్న రాజగోపాల్‌ రెడ్డి వైఎస్‌ ఆశయాల కోసం పాటుపడుతానన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌ శిశ్యులమని, ఆయనను మరువం అని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంతగా బెదిరించాలని చూసినా రాజగోపాల్‌ రెడ్డి భయపడేది లేదన్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకున్న నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోనని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు రాజగోపాల్‌ రెడ్డిని ఉద్దేశించి పెద్ద ఎత్తున ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయడంతో దానిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ‘నన్ను సీఎం.. సీఎం అని అంటున్నారు. ఒకవేళ ఆ సమయం గనక వస్తే దానిని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి రాజన్న రాజ్యంలో పరిపాలన కొనసాగిస్తామని రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.