
Pattaya Crackdown : పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి సముద్ర జలాల్లో మోహరించి ఉన్న అమెరికా విమాన వాహకనౌక అబ్రహాం లింకన్ తాజాగా తిరుగుప్రయాణమైంది. ఆ నౌకలో సుమారు 5 వేల మంది అమెరికా సైనికులు, మెరైనర్లు ఉన్నారు. వీరంతా గడచిన 200 రోజులుగా సముద్ర జలాల్లోనే ఉండి విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఏకధాటిగా ఇన్ని రోజులు విరామం లేకుండా విధులు నిర్వహించడంతో పాటు కనీస సదుపాయాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పని ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. నిజానికి ఏకధాటిగా ఇన్ని రోజులు సముద్రంలో ఉండటం ఇదే మొదటిసారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా ఈ నౌక ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చేరుకుంటుందని తెలుస్తోంది. దీంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టాయా నగరంలోని సెక్స్‌వర్కర్లను లక్ష్యంగా చేసుకుని అక్కడి పోలీసులు దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
Also Read : మూడు నదులు డేంజర్లో.. నేపాల్ కు ముంచుకొస్తున్న మరో ముప్పు?
పట్టాయా నగరం థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర తీరంలో ఉన్న ఈ నగరం నైట్‌లైఫ్, బీచ్‌లకు ప్రఖ్యాతిగాంచింది. కాగా, ఆ పట్టణానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లేమ్ చాబాంగ్ పోర్టు వద్ద యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ లంగరు వేయనున్నట్లు చెబుతున్నారు. ఇంత ఎక్కువకాలం గల్ఫ్‌జలాల్లో విధులు నిర్వర్తించడం ఆ నౌక చరిత్రలో ఇదే తొలిసారని తెలుస్తోంది. ఇప్పుడు అది వెనక్కి తిరిగి వస్తున్న క్రమంలో అందులోని సైనికులు, నావికులు, మెరైనర్లకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇస్తారు. దీంతో పట్టాయా నగరంలో వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని థాయ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే బీచ్‌ల సమీపంలో, నైట్ లైఫ్ ఏరియాల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచారు. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో జరిపిన సోదాల్లో దాదాపు 50 మంది అనుమానిత సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 29న బీచ్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో 18 మంది థాయ్‌లాండ్, ఐదుగురు లావోస్, ఇద్దరు ఉగాండాకు చెందిన మహిళలతో సహా 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే, నౌక వచ్చిన తర్వాత పట్టాయా పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉంటుందని చెప్పలేమని పోలీసులు వెల్లడిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పలువురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుంటున్నారు.
కాగా, ఇలాంటి నౌకల రాక అనేది ఆ ప్రాంతానికి ప్రతికూల అంశమే అయినప్పటికీ.. ఆర్థికంగా పట్టాయాకు కలిసొస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ నగరం ప్రధానంగా పర్యాటకం, వినోదరంగంపైనే ఆధారపడి ఉండటం, ఇక్కడ హోటళ్లు, రెస్టారంట్లు, బార్లు, దుకాణాలు, ఇతర వ్యాపారాలు ఉండటం వల్ల అమెరికా నౌక ఇక్కడికి వస్తే ఆ వ్యాపారాలు మరింత లాభసాటిగా మారతాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. నిజానికి వ్యభిచారం థాయ్‌లాండ్‌లో చట్టవిరుద్ధం. కానీ పట్టాయా, బ్యాంకాంక్ సహా పలు పర్యాటక ప్రాంతాల్లో అది విరివిగా కొనసాగుతోందని అక్కడివారు చెబుతున్నారు.
నిజానికి పట్టాయా ఒకపుడు మత్స్యకారుల గ్రామంగా వెలుగొందింది.. ఇప్పుడు వినోద కేంద్రంగా అభివృద్ధి చెందడానికి కారణం వియత్నాం యుద్ధం. ఆనాడు థాయ్‌లాండ్‌లో మోహరించిన అమెరికా సైనికులు.. విశ్రాంతి, వినోదం కోసం పట్టాయాకు వస్తుండేవారు . అలా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాలక్రమంలో అదొక పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందింది. నిజానికి మామూలు సమయంలోనూ పసిఫిక్ మహాసముద్ర జలాల్లో ఉండే శాన్‌డియాగో పోర్ట్ వద్ద అబ్రహాం లింకన్‌ను మోహరించి ఉంచడం జరుగుతోంది. కానీ పశ్చిమాసియా ఉద్రిక్తతలకు కొన్ని వారాల ముందు దాన్ని గల్ఫ్ జలాల్లోకి ప్రవేశపెట్టారు. నాటి నుంచి అక్కడే విధుల్లో ఉన్న ఈ నౌక.. ఇటీవలే గల్ఫ్ జలాలను వీడి తిరుగు ప్రమాణమైంది.
Also Read : నేపాల్ వరదలు.. నీటి ఉధృతిని తట్టుకుని నిలబడ్డ ఇల్లు! కారణం ఏంటో తెలుసా?









