
Sikkim Incident : దక్షిణ సిక్కింలోని నామ్చి జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సమర్దుంగ్ – జోలుంగే ప్రాంత పరిధిలోని తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణంలో ఉన్న సొరంగం (టన్నెల్) వద్ద సోమవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పటేల్ ఇంజినీరింగ్ సంస్థ నిర్వహిస్తోంది. పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో సొరంగం మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ప్రమాద తీవ్రతను పెంచుతూ అదే సమయంలో టన్నెల్ లోపల మీథేన్ గ్యాస్ లీకేజీ సంభవించింది. దీంతో రెస్క్యూ పనులకు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా, లోపల ఉన్నవారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
ప్రమాదం జరిగిన సమయంలో సొరంగం లోపల సుమారు 27 మంది వరకు కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మొదట 19 మంది కార్మికులు చిక్కుకోగా, సహాయక చర్యల కోసం లోపలికి వెళ్లిన పటేల్ ఇంజనీరింగ్ సిబ్బందిలో ఇద్దరు, అలాగే NHPCకి చెందిన ఆరుగురు సిబ్బంది కూడా లోపలే ఉండిపోయినట్లు సమాచారం. శిథిలాల కింద ఇంకా 20 మందికి పైగా చిక్కుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read : ఘజియాబాద్-న్యూఢిల్లీ మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 53 రైళ్లకు బ్రేక్..!
ఘటన సమాచారం అందగానే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు సంయుక్తంగా భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే సొరంగంలో మీథేన్ గ్యాస్ స్థాయిలు అధికంగా ఉండటంతో మొదట లోపలికి వెళ్లిన తొలి సహాయక బృంద సభ్యులు శ్వాసకోశ సమస్యలకు గురయ్యారు. వారిని వెంటనే బయటకు తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను వెలికితీసి, సింగ్తామ్ జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్టక్లోని ఎస్టీఎన్ఎమ్ (STNM) ఆసుపత్రి, నామ్చి జిల్లా ఆసుపత్రులకు తరలించారు. నామ్చి జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ విడుదల చేసిన ప్రకటన ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం స్థానిక ఆరోగ్య శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో భాగస్వామ్యమయ్యాయి.
ఈ ఘటనపై నామ్చి జిల్లా కలెక్టర్ అనూపా తామ్లింగ్ స్పందిస్తూ.. సొరంగంలో ఎంతమంది ఉన్నారు, వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటనే దానిపై NDRF బృందం లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తి సమాచారం తెలిసిన వెంటనే తదుపరి వివరాలను వెల్లడిస్తామని యంత్రాంగం పేర్కొంది. ప్రస్తుతం NDRF బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Also Read : పేపర్ లీకేజీలపై ఉవ్వెత్తున ఉద్యమం.. మళ్లీ పార్లమెంట్ ముట్టడికి ‘సీజేపీ’ పిలుపు









