పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ వివాదం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇందులో హీరోయిన్‌గా నటించాల్సిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం ఏర్పడింది. అయితే ఇటీవల ఈ అంశంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో మళ్లీ కొత్త వివాదానికి తెరలేపాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రణయ్ రెడ్డి వంగా, దీపికా పదుకొణె ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తెలిపాడు. ఆమె కాల్‌షీట్లు/డేట్స్ సర్దుబాటు కాలేదని, భారీ స్థాయిలో ఆమె పారితోషికం డిమాండ్ చేశారని తెలిపారు. దీపికా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా వచ్చే లాభాల్లో 10 శాతం వాటా కూడా అడిగారని పేర్కొన్నారు. ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీపికా పదుకొణె నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌కు ఆమె చేసిన ‘లైక్’ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ నెటిజన్ తన పోస్ట్‌లో “ఒక పురుష నటుడు భారీ పారితోషికం లేదా లాభాల్లో వాటా అడిగితే దాన్ని అతడి మార్కెట్ విలువగా భావిస్తారు. కానీ ఒక అగ్ర కథానాయిక అలాంటి డిమాండ్లు చేస్తే మాత్రం సహించలేకపోతున్నారు. ఆమె ప్రాజెక్ట్‌కు ‘నో’ చెప్పడం వల్ల నిర్మాతల ఈగో దెబ్బతింది. ఇది కేవలం పురుషాధిక్య అహంకార సమస్య మాత్రమే” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను దీపిక లైక్ చేయడంతో తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల అసలు కారణం పురుషాధిక్య ధోరణేనని ఆమె పరోక్షంగా అంగీకరించినట్లయింది. హై-వోల్టేజ్ కాప్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదట దీపికా పదుకొణెను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆమె డిమాండ్లు ఎక్కువగా చేయడంతో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే మరి ఈ వివాదంపై ‘స్పిరిట్’ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.